ఏపీ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ రోజు (సోమవారం) నుంచి ధ్రువపత్రాల తనిఖీ ప్రారంభం కావాల్సి ఉండగా.. చివరిముహూర్తంలో విద్యాశాఖ ఒక రోజు వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటికే మెరిట్ జాబితాను విడుదల చేసి, అర్హత సాధించిన వారికి ర్యాంకులు కేటాయించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లు, స్థానికత ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం కాల్ లెటర్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు జాబితాలను మరోసారి జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.
అసలుగా ఆదివారం నుంచే అభ్యర్థుల లాగిన్‌లకు కాల్ లెటర్లు పంపి, సోమవారం నుంచి సర్టిఫికెట్ల తనిఖీ జరగాల్సింది. అయితే కాల్ లెటర్ల ప్రక్రియలో ఆలస్యం రావడంతో షెడ్యూల్ మార్చక తప్పలేదు.
ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్‌లలో కాల్ లెటర్లను అందుబాటులో ఉంచనున్నారు. రేపటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది.