దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) తమ జవాన్లను లక్ష్యంగా చేసుకుని విస్తరిస్తున్న నకిలీ మొబైల్ యాప్‌పై అప్రమత్తం చేసింది. ‘సంభవ్ అప్లికేషన్ రైటర్’ పేరుతో తయారు చేసిన ఈ ఫేక్ యాప్, అధికారిక ‘సీఆర్పీఎఫ్ సంభవ్’ యాప్‌ను అనుకరించి సున్నితమైన వ్యక్తిగత, విధి సంబంధిత సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తోందని ఐటీ విభాగం హెచ్చరించింది.
వాట్సాప్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ యాప్, సిబ్బంది ఫోర్స్ ఐడీ, యూనిట్ పేరు వంటి వివరాలను పొందడానికి ప్రలోభపెడుతోందని గుర్తించిన సీఆర్పీఎఫ్, “ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయవద్దు, వాడొద్దు” అని స్పష్టం చేసింది.
జీతాలు, సెలవులు, బదిలీల అర్హత వంటి అధికారిక సమాచారం కోసం కేవలం అసలైన ‘సంభవ్’ యాప్‌నే వాడాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఈ నకిలీ యాప్‌ను వెంటనే ఆన్‌లైన్ స్టోర్ల నుంచి తొలగించాలంటూ సైబర్ భద్రతా ఏజెన్సీలను కోరింది. అన్ని యూనిట్ల కమాండర్లు రోల్‌కాల్స్‌లో జవాన్లకు ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలియజేయాలని ఆదేశించింది.
నక్సల్ వ్యతిరేకం, ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో పాల్గొంటున్న సిబ్బంది డేటా బయటకు లీకైతే దేశ భద్రతకే ముప్పు ఏర్పడుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.