కువైట్ ప్రభుత్వం 2030 నాటికి ఒక పెద్ద మార్పు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు న్యాయ వ్యవస్థలో ఎక్కువగా విదేశీ జడ్జీలు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈజిప్ట్, జోర్డాన్, సూడాన్ లాంటి దేశాల నుండి చాలా మంది జడ్జీలు కువైట్ కోర్టుల్లో సేవలందిస్తున్నారు. కానీ ఇకపై 2030 కల్లా ఈ వ్యవస్థ పూర్తిగా మారనుంది. కువైట్‌లోని అన్ని కోర్టులలో కేవలం స్థానిక పౌరులే జడ్జీలుగా పనిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనిని అక్కడ “కువైటైజేషన్” అనే పదంతో వ్యవహరిస్తున్నారు. అంటే ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం, విదేశీయులపై ఆధారాన్ని తగ్గించడం. ఈ ప్రక్రియను క్రమంగా మొదలుపెట్టారు.
న్యాయశాఖ మంత్రి నాసర్ అల్-సుమైత్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ 2030 నాటికి పూర్తిగా స్థానికులే న్యాయస్థానాలను నడుపుతారని, ఇది ఎటువంటి మార్పు లేని ఖరారైన నిర్ణయం అని స్పష్టం చేశారు. కానీ కేవలం స్థానికులను నియమించడం మాత్రమే లక్ష్యం కాదని, వారికి తగిన శిక్షణ, అర్హత, నైపుణ్యాన్ని పెంచడంపైనే ప్రధాన దృష్టి పెడతామని ఆయన చెప్పారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా, పారదర్శకంగా పనిచేయడానికి కొత్త చట్టాలను కూడా తీసుకురావడానికి కువైట్ సిద్ధమవుతోంది. త్వరలో రానున్న Judicial Independence Law ఈ దిశలో కీలక పాత్ర పోషించనుంది.
కేవలం న్యాయ రంగంలోనే కాకుండా కువైట్ ఇతర రంగాలలో కూడా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ప్రయత్నిస్తోంది. ఆయిల్, ఇంజినీరింగ్, మెడిసిన్, ఎడ్యుకేషన్, అకౌంటింగ్, ఫైనాన్స్ వంటి అనేక రంగాల్లో ఇప్పటి వరకు చాలా మంది విదేశీయులు పనిచేస్తున్నారు. ఇప్పుడు వారిని తగ్గిస్తూ స్థానికులను నియమించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఉదాహరణకు, Kuwait Petroleum Corporation (KPC)లో ఉన్న అగ్రస్థాయి పదవులన్నీ ఇప్పటికే స్థానికులకే ఇచ్చారు. ఈ విధానం అన్ని రంగాలలో విస్తరించబోతోంది.
విదేశీయులు కువైట్‌లో ఉద్యోగం చేయాలంటే ఇకపై కఠినమైన ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మెడిసిన్, ఇంజినీరింగ్, లా, ఎడ్యుకేషన్, అకౌంటింగ్ వంటి కీలక రంగాల్లో పనిచేయాలంటే ఆన్‌లైన్ పరీక్షలు తప్పనిసరిగా పాస్ కావాలి. అంతేకాక, వారి విద్యా సర్టిఫికేట్లు 3 నుండి 5 సంవత్సరాల పాటు పూర్తిగా వెరిఫై చేయబడతాయి. ఎవరు ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించినా లేదా తప్పు వివరాలు ఇచ్చినా, వారికి ఉద్యోగం దొరకడమే కాదు కఠిన చర్యలు కూడా తీసుకుంటారు. కొన్ని రంగాల్లో సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా తప్పనిసరి చేశారు. అంటే, అక్కడ ఉద్యోగం పొందడం ఇంతకు ముందు ఉన్నంత సులభం ఇక ఉండదు.
ఈ నిర్ణయాల వెనుక కువైట్ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వారి దేశంలోని స్థానిక యువతకు మరిన్ని అవకాశాలు కల్పించడం, దేశ ఆర్థికాభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయించడం. ఇంతవరకు కువైట్ ఉద్యోగాల కోసం ఎక్కువగా విదేశీయులపై ఆధారపడి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితిని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది స్థానికులకు మంచి అవకాశం అయినా, అక్కడ పని చేస్తున్న వేలాది మంది విదేశీయులకు మాత్రం పెద్ద సవాలు అవుతుంది.