విజయవాడ నగరం ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా అపారమైన ప్రాధాన్యం కలిగిన ప్రదేశం. ఇక్కడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ, గుణదల మేరిమాత కొండ, గాంధీ కొండలు ప్రత్యేకంగా నిలిచాయి. వాటిలో గాంధీ హిల్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రదేశంగా వెలుగొందుతోంది. మహాత్మా గాంధీ జ్ఞాపకార్థంగా నిర్మించబడిన ఈ కొండపై స్మారక స్థూపం ఎన్నో దశాబ్దాలుగా సందర్శకులను ఆకట్టుకుంటూ వస్తోంది. 1964లో ప్రారంభమైన ఈ నిర్మాణం, 1968లో గాంధీజీ శతజయంతి సందర్భంగా అప్పటి రాష్ట్రపతి డా. జాకిర్ హుసేన్ చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేయబడింది. 52 అడుగుల ఎత్తులో నిర్మించబడిన ఈ స్థూపం విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.

గాంధీ హిల్ పర్యాటకులకు ఎంతో ఆకర్షణీయమైన ప్రదేశం అయినప్పటికీ, కొండ శిఖరంలోని గాంధీ స్థూపం చేరుకోవడంలో సందర్శకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటి వరకు అక్కడికి వెళ్లే మార్గం మెట్లద్వారానే ఉండటంతో వృద్ధులు, పిల్లలు, కుటుంబాలతో వచ్చే పర్యాటకులకు అసౌకర్యం కలిగేది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని గాంధీ హిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధునిక అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా భారీ జంబో లిఫ్ట్ నిర్మించారు. మిడిల్ డౌన్ నుంచి స్మారక స్థూపం వరకు సులువుగా చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ లిఫ్ట్‌తో పాటు వ్యూ పాయింట్ ట్రైన్, పలు సౌకర్యాలను కూడా నిర్మించారు.
గాంధీ జయంతి సందర్భంగా తొలిసారిగా సీఎం చంద్రబాబు గాంధీ హిల్ సందర్శన చేయనున్నారు. ఆయన గాంధీ స్మారక స్థూపం వద్దకు చేరుకొని బెజవాడ నగర సౌందర్యాన్ని వీక్షించనున్నారు. అలాగే కొత్తగా నిర్మించిన జంబో లిఫ్ట్, పర్యాటక అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గాంధీ హిల్ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి, గాంధీ హిల్‌కు పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం, ఫౌండేషన్ కలిసి కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
భవిష్యత్తులో గాంధీ హిల్ విజయవాడలో పర్యాటక కేంద్రమాత్రమే కాకుండా చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు కేవలం మెట్ల మార్గం ద్వారానే అందుబాటులో ఉన్న గాంధీ స్థూపం, ఇప్పుడు లిఫ్ట్ సౌకర్యం ప్రారంభం తర్వాత అందరికీ మరింత చేరువ కానుంది. ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులు, పర్యాటకులు సులువుగా స్మారక స్థూపాన్ని దర్శించగలగడం ఒక పెద్ద ముందడుగు. గాంధీ హిల్ చరిత్ర, ఆధునిక సదుపాయాలతో కలిసిపోతూ పర్యాటకులకు మరింత ఆకర్షణీయ కేంద్రంగా మారనుంది.