ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. తాజాగా వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయగా.. కోర్టు రిమాండ్ విధించింది. అయితే తాజాగా ఈ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం తెరపైకి వచ్చింది. ప్రముఖ మద్యం బ్రాండ్లు తయారు చేసే బడా కంపెనీల పేర్లు బయటకొచ్చాయి.
ఆ కంపెనీలు మద్యం వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డాయంటూ అభియోగపత్రంలో పేర్లు ప్రస్తావించారు. ఈ మేరకు విచారణలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని మద్యం కంపెనీలు లంచాలు ఇచ్చి అక్రమంగా లాభాలు పొందాయని చెబుతున్నారు. వీటిలో తిలక్ ఇండస్ట్రీస్, అంబర్ స్పిరిట్స్, ట్రొపికల్, ఎస్‌ఎన్‌జీ షుగర్స్ సహా 12 మద్యం కంపెనీల పేర్లు దాఖలు చేసిన అభియోగపత్రంలో ప్రస్తావించారు.
ఈ మద్యం కుంభకోణంలో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ మ్యాన్షన్ హౌస్ బ్రాండ్‌ను అమ్ముతుంది. అంబర్ స్పిరిట్స్, ట్రాపికల్ ఇన్ బెవ్, ఎస్‌ఎన్‌జీ షుగర్స్, బి9 బెవరేజెస్ వంటి కంపెనీలపై ఆరోపణలు ఉన్నాయి. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా దాదాపు ₹1,472 కోట్ల ఆదాయం పొందింది. అందులో ₹218 కోట్లు లంచంగా ఇచ్చిందని అభియోగపత్రంలో ఉంది.
ఎస్‌ఎన్‌జీ షుగర్స్ దాదాపు ₹350 కోట్లు, యూవీ డిస్టిలరీస్ ₹29.80 కోట్లు, పీవీ స్పిరిట్స్ ₹37.92 కోట్లు లంచంగా ఇచ్చారని పేర్కొన్నారు. బి9 బెవరేజెస్ 2019 నుంచి 2024 మధ్య ఏపీకి భారీ మద్యం సరఫరా చేసింది. బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా దాదాపు ₹360 కోట్లు పొందిందన్న ఆరోపణలు ఉన్నాయి.
దర్యాప్తు బృందం అనుమానాస్పద లావాదేవీలు గుర్తించగా.. తిలక్ నగర్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా వచ్చిన డబ్బును నాలుగు జ్యువెలరీ కంపెనీల ద్వారా నకిలీ లెక్కలుగా మార్చిందని చెప్పారు. నగల వ్యాపారుల ద్వారా లాభాలు బంగారంగా మారి సిండికేట్ సభ్యులకు చేరాయని పేర్కొన్నారు. ఇది తెల్ల డబ్బును నల్ల డబ్బుగా మార్చే పద్ధతిగా దర్యాప్తు బృందం అభివర్ణిస్తోంది.
కాగా, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అయితే ఈ ఆరోపణలను ఖండిస్తోంది. తమకు ఎలాంటి సమాచారం రాలేదని చెబుతోంది. ‘ప్రస్తుత ముఖ్యమంత్రి పరిశ్రమ అభివృద్ధికి సహకరించారు. ఈసారి కూడా పరిశ్రమకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాం’ అని కంపెనీ ఛైర్మన్ అమిత్ దహనుకర్ తెలిపారు.
బి9 బెవరేజెస్‌కు సరుకులు పంపే సంస్థలు ప్యాకేజింగ్ మెటీరియల్స్, ముడి సరుకులు పంపకుండానే నకిలీ బిల్లులు సృష్టించి, డబ్బు మార్చాయని దర్యాప్తు బృందం చెబుతోంది. ఒకప్పుడు ఏపీ మద్యం వినియోగంలో టాప్ 3లో ఉండేది. కానీ ధరలు పెరగడం, లోకల్ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో అమ్మకాలు తగ్గాయని చెబుతున్నారు. 2023 అక్టోబర్‌లో అమలు చేసిన కొత్త ఎక్సైజ్ పాలసీ నేపథ్యంలో రిటైల్ అవుట్‌లెట్ల సంఖ్య పెంచారు.