ఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రం నుంచి వారానికి 1,194 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయని కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ రాజ్యసభలో వెల్లడించారు. ఇప్పటికే ఓర్వకల్లు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం 2021లో ప్రారంభమైందని తెలిపారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఉందని పేర్కొన్నారు.
ఇంకా కుప్పం ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కోసం దరఖాస్తు చేసిందని తెలిపారు. గతంలో కుదిరిన దగదర్తి ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని వెల్లడించారు. 2008 గ్రీన్‌ఫీల్డ్ విధానం ప్రకారం కొత్త అభివృద్ధికర్తను ఎంపిక చేయాలి, అవసరమైన అనుమతులు, భూసేకరణ చేయాలని సూచించారు. అలాగే ఈ ప్రాజెక్టులకు అవసరమైన ఆర్థిక వనరులు కూడ సమకూర్చుకోవాలని చెప్పారు.
ఇక ఉడాన్ పథకం 5.5 కింద రుషికొండ, అరకు, లంబసింగి, కాకినాడ, నర్సాపూర్, కోనసీమ, తిరుపతి తదితర ప్రాంతాల్లో సముద్ర విమాన సేవలు ప్రారంభించేందుకు ఉద్దేశపత్రాలు జారీ చేశామని చెప్పారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భద్రతా నిబంధనల్లో మార్పులు చేసిన తర్వాత, ఈ సేవలు మరింత వేగంగా అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ అభివృద్ధులు రాష్ట్రానికి గణనీయమైన వైమానిక కనెక్టివిటీని తీసుకురావడమే కాకుండా, పర్యాటక రంగానికీ పెద్దగా ఊతమివ్వనున్నాయి.