ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్‌లు తీసుకువస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన "ఫ్రీడమ్ ఆఫర్"కు వినియోగదారుల నుండి అద్భుతమైన స్పందన రావడంతో, ఈ ఆఫర్‌ను మరో 15 రోజులు పొడిగించింది. దీంతో ఆగస్టులో సిమ్ యాక్టివేషన్ ప్రక్రియ పూర్తి చేయలేకపోయిన వారికి మళ్లీ అవకాశం లభించింది.
ఈ ఆఫర్ కేవలం కొత్త సిమ్ తీసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. కేవలం రూ.1 చెల్లించి సిమ్ కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకుంటే, మొదటి 30 రోజులపాటు పూర్తిగా ఉచిత సేవలు లభిస్తాయి. రోజుకు 2GB హై–స్పీడ్ డేటా, అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కస్టమర్లకు అందించబడతాయి. అదనంగా ఉచిత బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్, రీఛార్జ్ బోనస్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

ఫ్రీడమ్ ఆఫర్‌ను యాక్టివేట్ చేయడం చాలా సులభం. వినియోగదారులు MyBSNL యాప్ లేదా BSNL సెల్ఫ్‌కేర్ పోర్టల్‌లో లాగిన్ అయి “ఫ్రీడమ్ ఆఫర్”ను ఎంచుకొని రూ.1 రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ పూర్తయ్యిన వెంటనే ఆఫర్ యాక్టివ్ అవుతుంది. అలాగే USSD కోడ్ ద్వారా కూడా ఈ సౌకర్యాన్ని ప్రారంభించుకోవచ్చు.
మొదటి నెల ఉచిత సౌకర్యాల అనంతరం, కస్టమర్లు తమకు నచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్ సాధారణ రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకుని సేవలను కొనసాగించవచ్చు. కొత్త వినియోగదారులను ఆకట్టుకునే ఈ ఆఫర్ బీఎస్‌ఎన్‌ఎల్ భవిష్యత్‌లో మరింత పోటీగా నిలబడేందుకు ఉపయోగపడనుంది.