ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్నలకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆప్కో బకాయి పడిన నిధుల చెల్లింపులను ప్రారంభించింది. తొలి విడతగా రూ.2 కోట్లకు పైగా బకాయిలను 7 డివిజన్లలోని 84 సొసైటీల ఖాతాల్లో జమ చేసినట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. మిగిలిన బకాయిలను కూడా విడతల వారీగా త్వరలో చెల్లిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
ఆప్కో చేనేత సహకార సంఘాల వద్ద నుంచి వస్త్రాలు కొనుగోలు చేస్తూ, వాటిని విక్రయశాలలు, ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తుంది. అయితే చెల్లింపులు ఆలస్యమవడంతో నేతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని, బకాయిలలో 20 శాతం మొత్తాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం చేనేతలకు ఊరట కల్పించింది. దీంతో సొసైటీల్లో నిల్వలు తగ్గుతాయని నేతన్నలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చేనేతల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కి నెలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తోంది. అలాగే థ్రిఫ్ట్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోంది. నేతన్నల మగ్గాలు మోగేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని మంత్రి సవిత తెలిపారు.
చేనేత వస్త్రాలకు మరింత మార్కెటింగ్ కల్పించేందుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో చేనేత బజార్లను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆప్కో ద్వారా పట్టుచీరలు, రెడీమేడ్ దుస్తుల విక్రయాలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో జరుగుతున్నాయి. అంతేకాకుండా నేతన్నలకు అండగా ఉండేందుకు చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.