టెక్నాలజీ అభివృద్ధితో మనం ఊహించని మార్పులు చూస్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం ఫొటోలను వీడియోలుగా మార్చడమే పెద్ద అద్భుతంగా అనిపించింది. కానీ ఇప్పుడు ఏఐ ఆధారంగా త్రీడీ ప్రింటింగ్ బాగా ట్రెండ్ అవుతోంది. ఫొటోలను త్రీడీ రూపంలోకి మార్చి కొత్త అనుభూతి పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ టెక్నాలజీని మరింత సులభంగా ఉపయోగించుకునేలా గూగుల్ జెమినీ ఏఐ ముందుకు వచ్చింది.
గూగుల్ జెమినీ ద్వారా మీరు మీ సాధారణ ఫొటోను త్రీడీ మోడల్‌గా మార్చుకోవచ్చు. దీని కోసం ముందుగా గూగుల్ జెమినీ ఏఐ ఆప్‌లోకి వెళ్లాలి. అందులో Ask Gemini అనే ఆప్షన్ కింద ఉన్న + బటన్ పై క్లిక్ చేస్తే కెమెరా, ఫైల్స్ అప్‌లోడ్, డ్రైవ్ నుంచి ఫొటోలు జోడించడం వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో Upload Files ఎంచుకుని, మీకు నచ్చిన ఫొటోను గ్యాలరీ నుంచి అప్‌లోడ్ చేయాలి.
ఫొటోను అప్‌లోడ్ చేసిన తర్వాత ఒక ప్రాంప్ట్ పేస్ట్ చేయాలి. ఉదాహరణకు, "Create a 1/6 scale commercialized figure of the character..." అనే ప్రాంప్ట్‌ని పెట్టి సబ్మిట్ చేస్తే, ఆ ఫొటో 3D మోడల్ రూపంలోకి మారుతుంది. మీరు కావాలనుకుంటే ఆ టెక్స్ట్‌ని మార్చి వేరే స్టైల్‌లో కూడా త్రీడీ ఫొటో రూపొందించుకోవచ్చు. అంటే పూర్తిగా మీ ఇష్టానుసారం డిజైన్ మార్చుకునే అవకాశముంది.
ఇలా ఫొటోను ప్రాసెస్ చేసిన తర్వాత కాసేపట్లోనే త్రీడీ రూపంలో మీ ఫొటో కనపడుతుంది. అది కేవలం ఫొటో కాకుండా, స్పష్టమైన మోడల్ రూపంలో ఉండటం వలన కొత్తగా అనిపిస్తుంది. ముఖ్యంగా త్రీడీ ఫొటోలు విభిన్న భంగిమల్లో కనపడటం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. చివరగా మీరు ఆ ఫొటోను డౌన్‌లోడ్ చేసుకుని మీ వద్ద దాచుకోవచ్చు.
ఈ విధంగా గూగుల్ జెమినీ ఏఐ మనకు కొత్త అనుభవాన్ని ఇస్తోంది. ఒక సాధారణ ఫొటోనే త్రీడీ రూపంలో చూసే అవకాశం కలగడం వలన చాలామంది దీన్ని ట్రై చేస్తున్నారు. ఇది వినోదం మాత్రమే కాదు, భవిష్యత్తులో క్రియేటివ్ వర్క్స్, ప్రెజెంటేషన్స్, మోడలింగ్ డిజైన్స్ వంటి అనేక రంగాల్లో ఉపయోగపడే అవకాశం ఉంది. టెక్నాలజీ ఇంత వేగంగా ఎదుగుతున్న తరుణంలో, ఈ కొత్త ఫీచర్ యూజర్లకు ఆకర్షణగా మారింది.