వైఎస్సార్ కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో స్టీల్స్టాంట్ స్థాపనకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్లాంట్ ఏర్పాటుపై జేఎస్ డబ్ల్యూ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దీంతో రూ.4,500 కోట్ల పెట్టుబడితో స్టీల్స్టాంట్ తొలి దశ పనులు ప్రారంభం కానున్నాయి.
రూ.11,850 కోట్లతో రెండో దశ పనులు పూర్తి చేయనున్నారు. ఈ ప్లాంట్ కోసం సంస్థకు ఎకరా రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం సున్నపురాళ్లపల్లెలో 1,100 ఎకరాలు కేటాయించింది. 2026 జనవరి నాటికి తొలి దశ పనులు ప్రారంభించి, ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
2029 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని ఆదేశించింది. 2031 జనవరి నాటికి రెండో దశ పనులు మొదలు పెట్టి.. 2034 ఏప్రిల్ నాటికి స్టీల్ ప్లాంట్లో రెండో దశ ఉత్పత్తి ప్రారంభించాలని స్పష్టం చేసింది. గతంలోనే ప్లాంట్ కు భూమిపూజ జరిగినా.. వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది.
ఇటీవల కూటమి ప్రభుత్వం రాకతో పరిశ్రమ నిర్మాణానికి సన్నాహాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే సున్నపురాళ్లపల్లెలో ప్రభుత్వ అధికారులు, జేఎస్ డబ్ల్యూ సంస్థ ప్రతినిధులు సర్వే నిర్వహించారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        