సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద జరిగిన జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ భద్రత, ఐక్యతపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. "భారత్ వైపు ఎవరు కన్నెత్తి చూసినా, ఇప్పుడు వారి ఇంట్లోకే చొరబడి సమాధానం ఇస్తోంది" అని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం శత్రు భూభాగంలోకి ప్రవేశించి చేసిన దాడులు ప్రపంచానికి భారత్ సైనిక శక్తిని చాటాయని మోదీ అన్నారు. దేశ రక్షణలో తమ ప్రభుత్వ ధోరణి పటేల్ ఆశయాలకు అనుగుణమని ఆయన పేర్కొన్నారు.
మోదీ మాట్లాడుతూ, “పాకిస్థాన్ వంటి దేశాలు, ఉగ్రవాదానికి వెన్నుదన్నుగా ఉన్న శక్తులు భారత్ శక్తి ఏమిటో ఇప్పుడు బాగా తెలుసుకున్నాయి. దేశం భద్రతపై ఎవరూ రాజీ పడరని సంకేతం ఇప్పుడు ప్రపంచానికి స్పష్టమైంది” అని తెలిపారు. సర్దార్ పటేల్ చూపిన మార్గం ప్రకారం దేశ ఐక్యతను కాపాడటమే తమ ధ్యేయమని ప్రధాని అన్నారు. ఆయన పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి, ప్రజలతో కలిసి ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు.
జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రధాని కాంగ్రెస్ పార్టీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. పటేల్ ఆశయాలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. “దేశ భద్రత, సరిహద్దు సమగ్రత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. నక్సలిజం, చొరబాట్ల వంటి అంతర్గత సవాళ్లను అణచడంలో నిస్సహాయంగా చూశాయి” అని మోదీ అన్నారు. ఆయన మాట్లాడుతూ, 2014కు ముందు నక్సలైట్లు 125 జిల్లాల్లో సమాంతర పాలన సాగించగా, ప్రస్తుతం అది కేవలం 11 జిల్లాలకు పరిమితమైందని వివరించారు.
చొరబాట్లు దేశ ఐక్యతకు తీవ్ర ముప్పుగా మారాయని హెచ్చరిస్తూ, “ఓటు బ్యాంకుల కోసం గత ప్రభుత్వాలు దేశ భద్రతను పణంగా పెట్టాయి. కానీ మా ప్రభుత్వానికి దేశం ముందు, రాజకీయాలు తరువాత. చట్టవిరుద్ధంగా దేశంలో నివసిస్తున్న ప్రతి చొరబాటుదారుడిని గుర్తించి బయటకు పంపాలి” అని మోదీ పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న భిన్నత్వమే భారత బలం అని పటేల్ చూపిన దిశలో ముందుకు సాగాలని ఆయన హితవు పలికారు. “అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ హృదయ భేదాలు ఉండకూడదు. ఇదే పటేల్ ఇచ్చిన సందేశం” అంటూ మోదీ ప్రసంగాన్ని ముగించారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        