అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరిగిన సమావేశంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశం తర్వాత ఆయన సోషల్ మీడియా వేదికైనా (X) ఎక్స్ ద్వారా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌తో అద్భుతమైన భేటీ జరిగింది. అమెరికా, చైనా దేశాల మధ్య గౌరవం చాలా ఎక్కువగా ఉంది. ఈ సమావేశంతో ఆ గౌరవం మరింత పెరుగుతుంది అని తెలిపారు.
ట్రంప్ మాట్లాడుతూ రెండు దేశాల మధ్య అనేక అంశాలపై అంగీకారం కుదిరిందని, కొన్ని కీలక విషయాల పరిష్కారానికి కూడా దగ్గరగా వచ్చామని చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అనుమతితో చైనా భారీ స్థాయిలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా సోయాబీన్, జొన్న, ఇతర పంటలు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. దీనివల్ల రైతులు చాలా సంతోషిస్తారు అని ట్రంప్ అన్నారు.
ట్రంప్ మాట్లాడుతూ చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా చైనా రేర్ ఎర్త్, క్రిటికల్ మినరల్స్, మాగ్నెట్స్ వంటి విలువైన ఖనిజ పదార్థాలను అమెరికాకు స్వేచ్ఛగా సరఫరా చేయడానికి అంగీకరించింది అని తెలిపారు.
ఫెంటనిల్ మత్తు మందుల అక్రమ రవాణా గురించి కూడా రెండు దేశాలు చర్చించాయి. ఫెంటనిల్ సమస్యను తగ్గించేందుకు చైనా కలిసి కృషి చేస్తుంది. ఈ ప్రాణాంతక డ్రగ్ అమెరికాలోకి రాకుండా నిరోధించేందుకు వారు సహకరిస్తారు అని ట్రంప్ పేర్కొన్నారు.
అలాగే చైనా అమెరికా నుండి ఇంధన ఉత్పత్తులు ముఖ్యంగా ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేయడానికి సిద్ధమైందని తెలిపారు. అలాస్కా రాష్ట్రం నుండి చైనా భారీ స్థాయిలో ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేయవచ్చు. ఈ విషయంపై క్రిస్ రైట్, డగ్ బర్గమ్ మరియు ఇరుదేశాల ఎనర్జీ బృందాలు చర్చలు జరపనున్నాయి అని వివరించారు.
ఈ రోజు కుదిరిన ఒప్పందాలు లక్షలాది అమెరికన్లకు అభివృద్ధి, భద్రత అందిస్తాయి. ఈ ఆసియా పర్యటన చారిత్రాత్మకమైంది అని ట్రంప్ తెలిపారు.
వాషింగ్టన్ డీసీకి తిరుగు ప్రయాణం మొదలుపెట్టిన ట్రంప్ మలేషియా, జపాన్, దక్షిణ కొరియా నాయకులు ఎంతో ఆత్మీయంగా ఆతిథ్యమిచ్చారు. అలాగే నిన్న రాత్రి విందు కార్యక్రమంలో పాల్గొన్న ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం దేశాలకు కూడా ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
ఈ సమావేశం ద్వారా అమెరికా–చైనా మధ్య వాణిజ్య, వ్యవసాయ, ఖనిజ, ఇంధన రంగాల్లో పెద్ద ఒప్పందాలు కుదిరాయి. రైతులకు, పరిశ్రమలకు లాభం చేకూరే అవకాశం ఉంది. రెండు దేశాలు కలిసి మత్తు మందుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఒప్పందాలు భవిష్యత్తులో రెండు దేశాల సంబంధాలను మరింత బలపరచనున్నాయి.