ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాభివృద్ధిలో మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా అనుమతుల్లేని లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పిస్తూ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) కు సంబంధించి తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) పరిధిలో మాత్రం ఈ స్కీమ్ వర్తించదు.
తాజా మార్గదర్శకాల్లో ప్రధాన అంశాలు ఇవే:
2025 జూన్ 30కి ముందు ఏర్పాటైన లేఅవుట్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
మొత్తం 18,000 ఎకరాలలోపైన అనధికారిక లేఅవుట్లు ఉన్నట్లు అంచనా.
ఆగస్టు 1వ తేదీ నుంచి LRS దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.
90 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
2014-19 మధ్య కాలంలో ఉన్న బేసిక్ ధరలే లెక్కకు తీసుకుంటారు.
ఆ ధరను స్థానిక సబ్ రిజిస్ట్రార్ ఫలితాలతో పోల్చి తక్కువదాన్ని పరిగణనలోకి తీసుకుని చార్జీలు వసూలు చేస్తారు.
లేఅవుట్‌లో 10% ఓపెన్ స్పేస్ లేకపోతే 14% అదనపు ఛార్జీ విధిస్తారు.
ఎక్కడ ఎక్కువ?
గుంటూరు, కడప, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పుగోదావరి, అనకాపల్లి జిల్లాల్లో అనుమతుల్లేని లేఅవుట్లు అధికంగా ఉన్నాయి. గతంలో 2014-19 మధ్య ఎల్ఆర్ఎస్, బీపీఎస్ అమలులో ఉండగా 65% దరఖాస్తులు పరిష్కరించబడ్డాయి. కానీ అనంతర కాలంలో అనధికారిక లేఅవుట్ల సంఖ్య భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
మొత్తంగా, ఇప్పటివరకు అనుమతుల్లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఈ అవకాశం వినియోగించుకుని తమ ఆస్తులను చట్టబద్ధం చేసుకునే అవకాశం కలిగినట్లు విశ్లేషకులు అంటున్నారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        