దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఉపయోగిస్తున్న ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థలో కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, వాహన యజమానులు తప్పనిసరిగా “నో యువర్ వెహికల్ (KYV)” ధృవీకరణను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియను నవంబర్ 1వ తేదీకి ముందే పూర్తి చేయని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ చెల్లదు. అంటే, టోల్ ప్లాజా వద్ద మీరు డిజిటల్‌గా చెల్లించలేకపోతారు. దాంతోపాటు నగదు ద్వారా చెల్లిస్తే రెండు రెట్లు టోల్ చార్జీ చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇటీవలి కాలంలో చాలా మంది ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌ను వేర్వేరు వాహనాలపై ఉపయోగించడం, మరికొందరు ట్యాగ్‌ను తీసుకెళ్లి ఇతర వాహనాల ద్వారా టోల్ దాటించడం వంటి అక్రమాలు పెరిగాయి. దీని వల్ల టోల్ సిస్టమ్‌లో అవకతవకలు, మోసాలు పెరిగాయని అధికారులు గుర్తించారు. అందుకే ఇప్పుడు KYVని తప్పనిసరి చేశారు. దీని ద్వారా ప్రతి ఫాస్ట్‌ట్యాగ్ దానికే జారీ చేయబడిన వాహనానికి మాత్రమే అనుసంధానమవుతుంది. పెద్ద వాహనాల కోసం ఉన్న ట్యాగ్‌లను చిన్న వాహనాలపై ఉపయోగించకుండా ఇది నిరోధిస్తుంది.
వాహన యజమానులు తమ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), గుర్తింపు రుజువు (ఆధార్, పాన్ లేదా పాస్‌పోర్ట్), అవసరమైతే వాహన ఫోటోలను అప్‌లోడ్ చేయాలి. ఈ ధృవీకరణను మీరు ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసిన బ్యాంక్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చు. "Know Your Vehicle" లేదా "Update KYV" అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, పత్రాలు అప్‌లోడ్ చేసి, OTP ద్వారా వెరిఫికేషన్ చేయాలి. ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ ట్యాగ్ “వెరిఫైడ్”గా చూపిస్తుంది. ధృవీకరణ చేయకపోతే, బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ట్యాగ్ ఆటోమేటిక్‌గా నిష్క్రియం (deactivate) అవుతుంది.
ప్రభుత్వం ప్రకారం, ఈ కేవైవీ విధానం పారదర్శకతను పెంచి, మోసాలను తగ్గిస్తుంది. దొంగిలించబడిన లేదా అమ్మిన వాహనాలను ట్రాక్ చేయడం సులభతరం అవుతుంది. అలాగే తప్పుడు టోల్ వసూలు తగ్గుతుంది. వాహనం విక్రయించబడినప్పుడు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ మారినప్పుడు మాత్రమే ఈ ధృవీకరణను మళ్లీ చేయాల్సి ఉంటుంది. ప్రజలకు ఇది మరో అదనపు ప్రక్రియగా అనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో ఇది డిజిటల్ టోల్ సిస్టమ్ విశ్వసనీయతను పెంచే చర్యగా ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల, టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుగానే KYV ధృవీకరణను పూర్తి చేయడం మంచిది.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        