కేంద్ర ఆర్ధిక శాఖ పరిధిలోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో.. ఎన్విరాన్మెంట్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 230 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 29, 2025 నుంచి ప్రారంభంకానుంది. మొత్తం పోస్టుల్లో ఎన్విరాన్మెంట్ ఆఫీసర్/ అకౌంట్ ఆఫీసర్ పోస్టులు 156, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్ పోస్టులు 74 వరకు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు జనరల్ అభ్యర్ధులకు 35 ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు 35 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్ధులకు 40 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు 45 ఏళ్లు ఉండాలి. అలాగే అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమీషనర్ పోస్టులకు జనరల్ అభ్యర్ధులకు 30 ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్ధులకు 35 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు 40 ఏళ్లు ఉండాలి.
రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు జులై 29, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తులను ఆగస్టు 18, 2025వ తేదీ రాత్రి 11 గంటగల 59 నిమిషాల వరకు సమర్పించవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, రాత పరీక్ష విధానం, సిలబస్ వంటి ఇతర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి కమిషన్ షాట్ నోటీస్ మాత్రమే జారీ చేసింది.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        