ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇకపోతే ఈ పథకం వల్ల తమ ఉపాధికి ఆటంకం కలగనుందని ఆటోడ్రైవర్లు వ్యక్తం చేసిన ఆందోళనలపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. మహిళలకు ఫ్రీ బస్ పథకం ప్రారంభించే అదే రోజున – ఈ నెల 15న – రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ఇప్పటికే వెల్లడించగా.. తాజాగా వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా అధికారికంగా ధ్రువీకరించారు. తెలంగాణలో 'మహాలక్ష్మి' పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుండగా, ఆటోడ్రైవర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న సంగతి తెలిసిందే. అదే పరిస్థితి ఏపీలోనూ మళ్లి తలెత్తకుండా ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ఆగస్టు 15 నుంచి ఏపీలోని పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్‌ప్రెస్ వంటి ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. జీరో ఫేర్ టికెట్లు ఇచ్చి, ప్రయాణ వివరాలు, ఆదా అయిన డబ్బు లెక్కలు బస్సులోనే చూపేలా చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించారు.
మొత్తంగా.. మహిళలకు ఉచిత ప్రయాణం, ఆటోడ్రైవర్లకు ఆర్థిక భరోసా.. రెండు పక్షాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రశంసనీయం.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        