ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో దూకుడు పెంచిన సిట్ అధికారులు హైదరాబాద్‌లో ఇవాళ(శనివారం జులై 24) పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా, మాజీ సీఎం జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ కార్యాలయాల్లో దర్యాప్తు సాగింది.
సిట్ అధికారుల విచారణ ప్రకారం, ఇప్పటికే అరెస్ట్ అయిన బాలాజీ గోవిందప్ప ఈ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న నేపధ్యంలో భారతీ సిమెంట్స్ కార్యాలయం కీలకంగా మారింది. బంజారాహిల్స్‌లో ఉన్న భారతీ సిమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో సిట్ అధికారులు పలు డాక్యుమెంట్లు పరిశీలించారు. సుమారు ఆరుగురు అధికారులతో కూడిన బృందం సోదాలు నిర్వహించింది.
రాజ్ కసిరెడ్డికి చెందిన రీసోర్స్ వన్ కంపెనీ, చాణక్యకు చెందిన టీ-గ్రిల్ రెస్టారెంట్‌లలోనూ సోదాలు జరిగాయి. కంపెనీల్లో జరిగిన సమావేశాలు, వాటికి సంబంధించిన సాంకేతిక ఆధారాలను సేకరించడంపై దృష్టి పెట్టారు.
సిట్ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూసేలా ఉన్నాయి. రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణంలో భాగంగా నగదు లావాదేవీలు భారతీ సిమెంట్స్ ద్వారా జరిగి ఉండొచ్చన్న అనుమానంతో అధికారులు కీలక ఆధారాల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆరు ప్రదేశాలకు ముడుపులు ఈ కంపెనీ నుంచి తరలించారని ప్రాథమిక సమాచారం.
డిస్టిలరీ యజమానులతో భేటీలు, మద్యం సరఫరా సంస్థలతో జరిపిన చర్చల వివరాలు సైతం సిట్ దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఈ భేటీల అనంతరం లక్షలాది రూపాయల ముడుపులు కంపెనీ ద్వారా చెలామణి అయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.