ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం పరిశీలనలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా అమరావతి జిల్లాను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. చారిత్రక, రాజకీయంగా కీలకమైన స్థానం కలిగిన అమరావతికి ప్రత్యేక జిల్లా హోదా కల్పించే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
దేవతల రాజధానిగా పేరొందిన అమరావతికి ప్రాచీన కాలం నుంచీ గొప్ప చరిత్ర ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణి నుంచి విజయనగర సామ్రాజ్యాల వరకు ఎన్నో శాసనాలు, శిలాశాసనాలతో పాటు గౌతమ బుద్ధుడి నిలయం కూడా ఇదే ప్రాంతం. ఆధునిక భారతదేశంలోనూ అమరావతికి మరో గుర్తింపు లభించింది – ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుగా అమరావతిని ఎంపిక చేయడం ద్వారా.
ప్రస్తుతం ప్రతిపాదిత అమరావతి జిల్లాలో పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, నందిగామ, జగ్గయ్యపేట వంటి నియోజకవర్గాలను కలపాలని చర్చలు జరుగుతున్నాయి. అమరావతిని కేంద్రంగా చేసుకొని ఈ నియోజకవర్గాలను కలుపుతూ ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తే, పరిపాలనా దృష్ట్యా మరింత సమర్థత సాధించవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
అంతేకాక, రాజధాని ప్రాంత అభివృద్ధికి ఇది ఉత్ప్రేరకంగా నిలుస్తుందని, అమరావతి పునఃజీవంతమయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే వరకు దీనిపై చర్చలు కొనసాగుతుండనున్నాయి.