పోలవరం, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్, సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
డయాఫ్రమ్ వాల్ 25,238 చదరపు మీటర్లు పూర్తి చేసి 40 శాతం పురోగతి సాధించామని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ 373 ప్యానల్స్కు గాను, ఇప్పటికే క్రిటికల్గా ఉన్న 130 ప్యానల్స్ పూర్తి చేసినట్టు చెప్పారు. వరద సమయంలో కూడా డయాఫ్రమ్ వాల్ పనులు ఆగకుండా, డీవాటరింగ్ చేసుకుంటూ 2025 డిసెంబర్కు పూర్తి చేస్తామని వెల్లడించారు.
గ్యాప్-1 ఎర్త్ కమ్ రాక్ ఫీల్ డ్యామ్ పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేసే లక్ష్యంగా జరుగుతున్నాయని వివరించారు. గ్యాప్-2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిజైన్స్ సీడబ్ల్యూసీ, పీపీఏ ఆమోదం పొందిన వెంటనే నవంబర్ నాటికి పనులు మొదలు పెడతామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తిచేసి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకువెళ్లేలా సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి నిమ్మల దిశానిర్దేశం చేశారు.