రష్యా తూర్పు తీరంలో సంభవించిన 8.8 తీవ్రత గల భారీ భూకంపం అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ భూకంపానికి సంబంధించిన భయంకర ప్రభావాల నేపథ్యంలో పసిఫిక్ మహాసముద్రంలోని హవాయి ద్వీపాలలోనూ అప్రమత్తత ప్రకటించారు. ముఖ్యంగా హొనలులో సునామీ హెచ్చరికలు జారీ చేస్తూ అధికారులు భారీ చర్యలు చేపట్టారు.
లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 9 లక్షల మందిని తక్షణమే ఎత్తైన ప్రాంతాలకు తరలించేందుకు సైరన్లు మోగించడంతో ప్రజలు ఆందోళనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు పరుగులు తీశారు. అధికారులు రక్షణ చర్యలు ముమ్మరం చేశారు.
ఇదిలా ఉండగా, జపాన్‌లోని టొకాచి తీర ప్రాంతంలో 1.3 మీటర్ల ఎత్తు కలిగిన అలలు తీరం వైపు దూసుకొచ్చినట్లు అక్కడి వాతావరణ శాఖ గుర్తించింది. దీంతో జపాన్ అధికారులు కూడా తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఈ విపత్తు నేపథ్యంలో పసిఫిక్ ప్రాంతమంతటా హై అలర్ట్ కొనసాగుతోంది. భవిష్యత్తులో మరిన్ని అలలు తాకే అవకాశం ఉండటంతో రక్షణ సంస్థలు మరియు స్థానిక పాలన యంత్రాంగం సమయానికి స్పందిస్తూ చర్యలు తీసుకుంటున్నాయి.