దోసె అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేవి బియ్యం, మినప్పప్పు. అయితే, ఎప్పుడూ ఒకే రకం దోసెలు తింటే బోర్ కొట్టడం సహజం. దోసెను ఇష్టపడేవారు సైతం కాస్త భిన్నంగా, కొత్త రుచిలో తింటేనే మజా ఉంటుంది. అందుకే, ఇక్కడ మనం చెప్పుకోబోయే బీరకాయ దోసె రెసిపీ మిమ్మల్ని కాస్త ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు, టేస్ట్‌లో షాక్ ఇస్తుంది. ఎంతో కమ్మగా, అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ దోసెను మీరు ఈరోజే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది తయారు చేయడం చాలా సులభం, పిండిని నానబెట్టాల్సిన పనే లేదు.
ఈ దోసె కోసం ముందుగా పావు కప్పు పెరుగు తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ, రెండు కప్పుల బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల బీరకాయ ముక్కలు కచ్చితంగా వేయాలి.
ఈ మిశ్రమాన్ని కలుపుతూ, ముప్పావు కప్పు నీళ్లు కొద్దికొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి కాకుండా రెండు విడతలుగా పోసి కలుపుకున్న తర్వాత, మూతపెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది.
ఆ తర్వాత, ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అందులోనే రెండు పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక అంగుళం అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దోసెకు మరింత క్రిస్పీనెస్ ఇవ్వడానికి, మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి.
(లేదంటే రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కలిపి వేసుకోవచ్చు). దీన్ని మరోసారి గ్రైండ్ చేసుకుంటే దోసె పిండి సిద్ధమవుతుంది. దోసె పిండికి ఫైనల్ టచ్ ఇవ్వడానికి, అర స్పూన్ పంచదార, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
పంచదార వేయడం ఇక్కడ సీక్రెట్ టిప్. ఇది వేయడం వల్ల దోసె అచ్చు హోటల్ స్టైల్లో ఎంతో క్రిస్పీగా వస్తుంది. ఇక చివరగా, కొద్దిగా వంట సోడా వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఇలా సిద్ధం చేసుకున్న పిండిని పక్కన పెట్టుకుని, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి, క్లాత్‌తో తుడిచి, ఆ తర్వాత రెండు గరిటెల పిండి వేసుకుని దోసెను సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి.
దోసె పైన ఒక స్పూన్ నెయ్యి రాసి, అర స్పూన్ కారం పొడి వేసుకుని స్ప్రెడ్ చేయాలి. అంతే! కేవలం ఒక నిమిషంలోనే దోసె ఎర్రగా కాలి, మంచి సువాసనతో మిమ్మల్ని పలకరిస్తుంది. ఈ బీరకాయ దోసెను కొబ్బరి చట్నీతో లేదా అల్లం చట్నీతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో వాళ్లకు ఈ కొత్త టేస్ట్ పరిచయం చేసి మెప్పు పొందండి.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        