మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. చిన్న చిన్న ఆహారపు అలవాట్లు కూడా మన శరీరంపై పెద్ద ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థను సరిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. తినే ఆహారానికి తగ్గట్టు నీరు తాగే సమయాన్ని కూడా జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. కొన్ని ఆహార పదార్థాలను తీసుకున్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మందగించి, కడుపులో అసౌకర్యాలు కలగవచ్చు. కనీసం 30 నిమిషాల నుంచి గంట వరకు ఆగడం మంచిది.
బొప్పాయి పండు 90 శాతం నీటితో నిండిఉంటుంది. దీనిని తిన్న వెంటనే నీటిని తాగితే, కడుపులో జీర్ణరసాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా అరుగుదల మందగించి, గ్యాస్ లేదా పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల బొప్పాయి తిన్న తర్వాత కనీసం 40 నుంచి 50 నిమిషాల పాటు నీటిని తాగకూడదు.
అలాగే అరటి పండు తిన్న వెంటనే నీటిని తాగడం కూడా మంచిది కాదు. అరటిలో పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పటికీ, వెంటనే నీరు తాగితే అరుగుదలలో అంతరాయం కలుగుతుంది. దీనివల్ల పొట్ట నిండిన భావం, బిగుతు, లేదా అజీర్ణం వస్తాయి. కనీసం అరగంట తర్వాతే నీరు తాగడం ఉత్తమం.
సిట్రస్ పండ్లు — అంటే నిమ్మ, మోసంబి, కమల పండ్లు — మన కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి. వీటిని తిన్న వెంటనే నీరు తాగితే, ఆ యాసిడ్స్ డైల్యూట్ అవుతాయి. ఫలితంగా పీహెచ్ బ్యాలెన్స్ దెబ్బతిని గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. పల్లీలు, పాలు కూడా ఇలాగే ప్రభావం చూపుతాయి. పల్లీలలో ఉన్న ఫ్యాట్, ప్రోటీన్ జీర్ణం కావడానికి సమయం పడుతుంది. వెంటనే నీరు తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది.
పాలను తాగిన వెంటనే నీటిని తాగడం కూడా తప్పు. దీనివల్ల పొట్టలో యాసిడిటీ పెరుగుతుంది, మెటబాలిజం మందగిస్తుంది. కనీసం అరగంట ఆగి నీరు తాగితే మంచిది. మొత్తం మీద, ప్రతి ఆహారానికి తగిన సమయాన్ని పాటించడం ద్వారా జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనేక జీర్ణ సంబంధ సమస్యలను నివారించవచ్చు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        