ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) కీలక పాత్ర పోషించాలని, వారే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగువారున్నారంటే ఆ క్రెడిట్ చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు శాసించేందుకు ఆయన విజనరీ కారణమని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30లక్షల మంది తెలుగు ప్రజలు ఉన్నారని లోకేశ్ తెలిపారు.
“రాష్ట్రంలో రాజకీయాలు, రాష్ట్ర పరిస్థితుల గురించి నా కంటే మీకే బాగా తెలుసు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో సైకో పాలన, విధ్వంస పాలన చూశాం. ఎన్నికల సమయంలో కొందరు దాదాపు 6 నెలలు ఏపీకి వచ్చి కష్టపడ్డారు.
రాష్ట్రాన్ని దారిలో పెట్టే విషయంలో కష్టపడినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గతంలో చంద్రబాబు అరెస్టయినపుడు ఇదంతా మనకు అవసరమా అని బ్రాహ్మణి అడిగింది. అదే సమయంలో హైదరాబాద్ లో 45వేల మంది ఐటీ నిపుణులు చంద్రబాబు వెంట ఉంటామని చెప్పారు.
ఐటీ నిపుణులు అండగా నిలబడ్డారు.. అదే మాకు కొండంత ధైర్యం ఇచ్చింది. తెలుగు జాతి అన్ని రంగాల్లో నెంబర్ వన్గా నిలిచేందుకు కష్టపడాలని ఆరోజే నిర్ణయించుకున్నా. దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సింగపూర్ను రోల్ మోడల్గా తీసుకుంటున్నాం” అని లోకేశ్ తెలిపారు. రాష్ట్ర మంత్రులు నారాయణ, టీజీ భరత్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        