వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బుధవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. గత జగన్ రెడ్డి ప్రభుత్వం మూడేళ్ల పాటు రైతులకు ఒక్క రూపాయికే బీమా అంటూ ప్రచారం చేసినా.. వాస్తవానికి నామమాత్రపు బీమా కూడా అమలు చేయకుండా రైతులను వంచించిందని విమర్శించారు.
రాష్ట్ర వాటా ప్రీమియాన్ని చెల్లించక పోవడంతో రూ.3,138 కోట్ల బీమా క్లెయిమ్లు పెండింగ్‌గా మారాయన్నారు. దీంతో రైతులకు నష్టాలు తప్ప లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీమా చెల్లించామని అబద్ధం చెప్పిన జగన్.. పార్టీ అధినేత చంద్రబాబు నిరసనకు దిగిన తర్వాతే రూ. 590 కోట్ల నగదు విడుదల చేసి తూతూ మంత్రంగా వ్యవహరించారని ఆరోపించారు.
పులివెందుల రిజర్వాయర్ నుంచి రైతులకు కాకుండా, తన బంధువులకు చెందిన భారతీ సిమెంట్ కంపెనీ, చీనీ తోటలకు నీరు మళ్లించడం ద్వారా వ్యవసాయాన్ని తాకట్టు పెట్టారంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహారశైలిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో వ్యవసాయం పక్కన పడేసి.. గంజాయి సాగుకే ప్రభుత్వ రక్షణ లభించడం వంటి దుర్భర పరిస్థితులు నెలకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గంజాయి సాగు విస్తరించినా రాష్ట్ర ప్రభుత్వం చర్చించకుండా మౌనంగా ఉండిపోయిందని.. కానీ రైతుల సమస్యలపై మాత్రం చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద జమ చేసే రూ. 2,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ. 5,000 మద్దతుగా ఆగస్టు 2వ తేదీన నగదు జమ చేయబోతోందని ఈ సందర్భంగా రైతులకు మంత్రి అచ్చెన్న గుడ్ న్యూస్ చెప్పారు.
జగన్ హయాంలో పూర్తిగా విస్మరించిన పంటల బీమా పథకాన్ని, కూటమి ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించడం రైతులకు ఇచ్చిన హామీల అమలుకు నిదర్శనమని చెప్పారు. ఇప్పటి వరకు 46.50 లక్షల మంది అర్హులైన రైతులకు ఈ పథకాల ప్రయోజనం చేకూరుతున్నదే కాక, ప్రభుత్వం ప్రతీ రైతు కుటుంబానికి సహాయం అందించే బాధ్యతతో పని చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.