సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో వైఫల్యం.. కలెక్టర్ సహా 13 మందికి నోటీసులు
తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదంలో తమ ఆదేశాలను అమలు చేయని తమిళనాడు సీఎస్ డాక్టర్ ఎం. సాయికుమార్, డీజీపీ మహేశ్ అగర్వాలా, మదురై కలెక్టర్ నిశాంత్ కృష్ణ సహా 13 మందికి సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఆలయ పాలక మండలిని సస్పెండ్ చేసి, భద్రతను CRPFకు అప్పగిస్తూ, రిటైర్డ్ జడ్జీల పర్యవేక్షణలో నవంబర్ 28న దీపత్తూన్ వద్ద కార్తీక దీపం వెలిగించాలని ఆదేశించింది.
నవంబర్ 28న (శనివారం) కొండపై దీపత్తూన్ వద్ద కార్తీక దీపం వెలిగించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన వైనం!
మదురై జిల్లా కలెక్టర్ నిశాంత్ కృష్ణ వివరణ, క్షమాపణలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం!
ధర్మకర్తలు అనుమతి ఇవ్వలేదన్న కారణంతో సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కనపెట్టడం కుదరదని తీవ్ర ఆగ్రహం!
Tamilnadu: తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం కీలక మలుపు తిరిగింది. తమ గత ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన తమిళనాడు ప్రభుత్వ అధికారులపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) డాక్టర్ ఎం. సాయికుమార్, డీజీపీ డాక్టర్ మహేశ్ అగర్వాలా, దేవాదాయ శాఖ కార్యదర్శి వి. రాజారాం, కమిషనర్ టీజీ వినయ్, మదురై దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ ఆర్. పొన్ స్వామినాథన్, మదురై జిల్లా కలెక్టర్ నిశాంత్ కృష్ణ, ఎస్పీ ఎల్. దేవనాథన్, అరుల్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయ కార్యనిర్వాహక అధికారి జి. సెల్వితో పాటు ఆలయ పాలక మండలి చైర్మన్ వి. షణ్ముగసుందరం, ట్రస్టీలు సి. రాజపాండియన్, కె. అళగప్పన్, కె. రెజినా దేవి, కె. చిత్ర—మొత్తం 13 మందికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది.
ఆలయ పాలక మండలి సస్పెన్షన్ – భద్రత సీఆర్పీఎఫ్కు అప్పగింత
కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా రాజకీయ పెద్దల సూచనల మేరకు అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ఆలయం మరియు దర్గా భద్రతను తక్షణమే కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (CRPF)కు అప్పగిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ప్రస్తుత ఆలయ ధర్మకర్తల మండలిని సస్పెండ్ చేసి, ఆలయ నిర్వహణ పర్యవేక్షణకు రిటైర్డ్ న్యాయమూర్తులను రిసీవర్లుగా నియమించింది.
నవంబర్ 28న దీపత్తూన్ వద్ద కార్తీక దీపం వెలగాల్సిందేనని స్పష్టత
దీపత్తూన్ వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు మరోసారి అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది; నవంబర్ 28న (శనివారం) కొండపై దీపత్తూన్ వద్ద కార్తీక దీపాన్ని వెలిగించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్తగా నియమించిన రిసీవర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఎలాంటి ఆటంకం లేకుండా జరిగేలా ఆలయ అధికారులు, సంబంధిత యంత్రాంగం పూర్తిస్థాయిలో సహకరించాలని ఆదేశించింది.
మదురై కలెక్టర్ క్షమాపణలను తోసిపుచ్చిన ధర్మాసనం
విచారణ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు అనుమతి ఇవ్వకపోవడంతోనే దీపం వెలిగించలేకపోయామని మదురై జిల్లా కలెక్టర్ నిశాంత్ కృష్ణ కోర్టుకు వివరణ ఇస్తూ క్షమాపణలు కోరారు. అయితే కలెక్టర్ వివరణ, క్షమాపణలతో సంతృప్తి చెందని సుప్రీంకోర్టు—కోర్టు ఉత్తర్వుల అమలుపై ఎలాంటి బేరసారాలకు తావులేదని, ధర్మకర్తలు అనుమతించలేదనే కారణంతో సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కనపెట్టడం కుదరదని, కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన పూర్తి బాధ్యత అధికారులదేనని తేల్చిచెప్పింది.
Tags
Be the first to react