తిరుమల శ్రీవారికి కొత్త ఆభరణాల ప్రత్యేక అలంకరణ... వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
TTD Updates: గత ఏడాది వైకుంఠ ద్వార దర్శన సమయంలో 7.83 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించారు. ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచి 8.34 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించాలని టీటీడీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోంది. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తిరుమల భక్తులకు టీటీడీ గుడ్న్యూస్!
వైకుంఠ ద్వార దర్శనాలకు భారీ ఏర్పాట్లు!
10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు!
Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారాన్ని వెల్లడించింది. తిరుమల శ్రీవారి మూలవిరాట్టుకు నూతన ఆభరణాలను అలంకరించారు. పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ నిన్న భారీ మొత్తంలో విలువైన ఆభరణాలను స్వామివారికి విరాళంగా అందించారు. దాత కోరిక మేరకు టీటీడీ అధికారులు ఈ రోజు ఆ ఆభరణాలను శ్రీవారి మూలవిరాట్టుకు అలంకరించారు. దీంతో శ్రీవారి అలంకరణలో కొత్త ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మరోవైపు, తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. దర్శన టోకెన్లు, టికెట్ల విడుదల తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈసారి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా దర్శన విధానాలను రూపొందిస్తోంది. మొత్తం 10 రోజుల్లో 92 శాతం సమయాన్ని సామాన్య భక్తుల కోసమే కేటాయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
గత ఏడాది వైకుంఠ ద్వార దర్శన సమయంలో 7.83 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించారు. ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచి 8.34 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించాలని టీటీడీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోంది. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
డిసెంబర్ 20, 21 తేదీల్లో మొత్తం 1.6 లక్షల మంది భక్తులకు ఈ-డిప్ విధానం ద్వారా సర్వదర్శనం టోకెన్లు కేటాయించనున్నారు. అలాగే డిసెంబర్ 22 నుంచి 29వ తేదీ వరకు శ్రీవాణి ట్రస్ట్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. టోకెన్ల కోసం ఈ-డిప్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఐదు రోజుల సమయం కల్పించే ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు సమాచారం.
వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులు టోకెన్లు, టికెట్ల విడుదల తేదీలు, రిజిస్ట్రేషన్ విధానంపై టీటీడీ అధికారిక ప్రకటనలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. దర్శన టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది.
Be the first to react