అల్లూరి సీతారామరాజు జిల్లాలో అర్ధరాత్రి వేళ ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని మలుపు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు.
ఈ బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి, వీరిలో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. వీరంతా చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీ సీతారాముల దర్శనం పూర్తి చేసుకుని, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం దేవస్థానం వైపు ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారని, అందుకే ఎక్కువ మందికి తప్పించుకునే అవకాశం దొరకలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భయంకరమైన ఈ ప్రమాదంలో 9 మంది నిద్రలోనే కన్నుమూసినట్లు పోలీసులు నిర్ధారించారు.
ప్రమాదస్థలంలో దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. బస్సు లోయలో పడి పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. విషయం తెలియగానే స్థానిక పోలీసులు, చింతూరు-మారేడుమిల్లి అధికారులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. గాయపడిన క్షతగాత్రులను వెంటనే సమీపంలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. లోయలో పడిన బస్సును బయటకు తీయడానికి, మృతదేహాలను వెలికి తీయడానికి చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘోర ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘాట్ రోడ్డులోని ప్రమాదకరమైన మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే బస్సు అదుపు తప్పిందని భావిస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. డ్రైవర్ అతివేగం లేదా నిద్రమత్తులో ఉండటం వంటి అంశాలపై విచారణ జరుగుతోంది.
అల్లూరి జిల్లాలో జరిగిన ఈ బస్సు ప్రమాదంలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని సహాయ నిధి (PMNRF) నుంచి మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈ దుర్ఘటనతో చిత్తూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ బంధువుల వివరాలు తెలుసుకోవడానికి మృతుల కుటుంబాలు ఆందోళనతో ఎదురుచూస్తున్నాయి.