ఇంటర్నెట్‌లో ఏఐ (కృత్రిమ మేథ) వాడకం ఒక్కరోజుకి పెరుగుతోంది. పనులు వేగంగా అయ్యేలా ఏఐ సహకరిస్తున్నా… దీనివల్ల కొన్ని ప్రమాదాలు కూడా ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ ప్లాట్‌ఫారమ్‌లో పిల్లల కోసం వస్తున్న వీడియోలు ఇప్పుడు పెద్ద చర్చకు కారణమయ్యాయి. ఇటీవల వచ్చిన ఒక నివేదిక ప్రకారం, యూట్యూబ్‌లో వేలాది నాసిరకం ఏఐ వీడియోలు పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని అప్‌లోడ్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో అసలు నాణ్యత లేకపోవడం, కథ లేకపోవడం, స్పష్టత లేని చిత్రాలు, అర్థం లేని వాయిస్‌లు ఉండటం పెద్ద సమస్యగా మారింది.
యూట్యూబ్ ఇటీవల క్రియేటర్లకు ‘నాణ్యత ఉన్న వీడియోలు చేస్తేనే సంపాదన’ అనే కొత్త నియమాలు పెట్టింది. అయినా కూడా చాలామంది క్రియేటర్లు ఈ రూల్స్‌ను తప్పించుకోవడానికి ఏఐ టూల్స్ వాడడం మొదలుపెట్టారు. చేతితో వీడియో చేయడం కష్టం, సమయం ఎక్కువ పడుతుంది… కానీ ఏఐతో కొద్ది సెకన్లలోనే వందల వీడియోలు తయారు చేయవచ్చు. ఈ కారణంగా చాలామంది క్రియేటర్లు పిల్లల కోసం అని నాసిరకం, అర్థం లేని ఏఐ వీడియోలు వరుసగా అప్‌లోడ్ చేస్తున్నారు.
బ్లూమ్‌బెర్గ్ ఇచ్చిన వివరాల ప్రకారం, చిన్నపిల్లలను ఆకట్టుకునేలా రంగులున్న కార్టూన్‌లా కనిపించే వీడియోలు చాలా వేగంగా తయారవుతున్నాయి. కానీ వాటిలో కథ, సందేశం, విలువలు ఏమీ ఉండవు. పిల్లలు చూసేందుకు బాగానే ఉన్నట్టనిపించినా… అసలు ప్రయోజనం ఉండదు. పలు సందర్భాల్లో ఏఐ వాయిస్‌లు కూడా చికాకు పెడతాయి. కొన్ని వీడియోలు చూస్తే పిల్లలు భయపడే అవకాశం కూడా ఉంది.
ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన ఒక సర్వేలో, రెండు సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా యూట్యూబ్ చూస్తున్నారని తల్లిదండ్రుల్లో 60 శాతం మంది అంగీకరించారు. అంటే చిన్నపిల్లలు స్క్రీన్‌కు చాలా దగ్గరైపోతున్నారు. దీనిని అవకాశంగా చూసుకున్న క్రియేటర్లు ఏఐతో మళ్లీ మళ్లీ వీడియోలు తయారు చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. అంతేకాదు… ఈ వీడియోలు ఎలా తయారు చేయాలో కూడా కొన్ని చానెల్స్‌లో బహిరంగా చూపిస్తున్నారు.
వైద్య నిపుణుల మాటల్లో చెప్పాలంటే, చిన్నపిల్లల చూసే వీడియోలు వారికి మాటల అభివృద్ధి, ఆలోచనా శక్తి, భావోద్వేగాలపై ప్రభావం చూపుతాయి. నాణ్యతలేని వీడియోలు ఎక్కువ చూస్తే పిల్లల్లో దృష్టి కేంద్రీకరణ తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
యూట్యూబ్ సంస్థ కూడా ఈ సమస్యను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల వీడియోలకు మరింత కఠినమైన నియమాలు పెట్టాలి, ఏఐతో తయారైన కంటెంట్‌ను ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ వల్ల ఉపయోగాలు ఉన్నా… పిల్లల ప్రపంచంలోకి నాసిరకం కంటెంట్ రావడం మాత్రం ప్రమాదంగా మారుతోంది.