"ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు" అన్న స్వామి వివేకానంద (Swami Vivekananda) మాటలు నేటి యువతకు ఆదర్శమని తానా మాజీ అధ్యక్షులు, ఏపి ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రతినిధి జయరాం కోమటి (jayaram komati) అన్నారు. స్వామి వివేకానంద 163 వ జయంతిని పురస్కరించుకొని యువజనదినోత్స వాన్ని ఆదివారం విజయవాడలోని హోటల్ ఐలాపురం కన్వెన్షన్ సెంటర్లో పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి ప్రతిభా పురస్కారాల వేడుక ఘనంగా జరిగింది.
శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయసీఈవో ,కళారత్న కత్తిమండ ప్రతాప్ అధ్యక్షతన సభ ఏర్పాటయింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జయరాం కోమటి మాట్లాడుతూ తన ఉపన్యాసాల ద్వారా, వాదనల ద్వారా ప్రపంచాన్ని జాగృతం చేసిన గొప్ప వేదాంతి స్వామి వివేకానంద అని కొనియాడారు.ప్రపంచంలోని తెలుగు ప్రజలందరి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
భారతదేశం తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వ్యక్తుల్లో స్వామి వివేకానంద మొదటి వారన్నారు. యువతలో స్ఫూర్తి నింపేలా స్వామి వివేకానంద చెప్పిన సూక్తులు అందరికీ ఆచరణీయమని అన్నారు. రామకృష్ణ మఠాన్ని స్థాపించడం ద్వారా భారతదేశ యువతకు దిశా నిర్దేశం చేసారని, స్వామి వివేకానంద ప్రసంగాలు అందరికీ ఆదర్శనీయమని అన్నారు.
తెలంగాణ యువజన సంఘల సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ కూన వేణు గోపాల కృష్ణ మాట్లాడుతూ జీవుడే దేవుడు అని చెప్పిన రామకృష్ణ పరమహంస సూత్రాన్ని పాటించి దరిద్ర నారాయణ సేవలో తరించిన గొప్ప మానవతావాది స్వామి వివేకానందుడని అన్నారు. అందరూ తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందని, వేదాంత తత్వాలు బోధించిన స్వామి వివేకానంద నేటి తరానికి ఆదర్శనీయుడని కొనియాడారు.
ఎన్నారై టిడిపి సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ మాట్లాడుతూ వ్యక్తిగత మోక్షంపై వ్యామోహాన్ని వదిలిపెట్టాలని ఇతరులను బంధ విముక్తులను చేయడమే మనిషికి జ్ఞానోదయమని నమ్మిన వ్యక్తి స్వామి వివేకానందుడని అన్నారు. తను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలో స్వామి వివేకానంద ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు.
పాన్ ఇండియా సోఫియా కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు అద్దంకి రాజా మాట్లాడుతూ భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన స్వామి వివేకానంద బోధనలు ఎందరికో ఆదర్శమని అన్నారు. స్వామి వివేకానంద జీవించింది అతి తక్కువ కాలమే అయినా ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి బోధనలు చేశారని వెల్లడించారు.
సభాధ్యక్షులు కళారత్న కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అన్న స్వామి వివేకానంద మాటలు ఎప్పటికీ ఆదర్శం అన్నారు. ఆయన బోధనలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని అన్నారు. ఈగల్ సెల్ ఎన్టీయార్ జిల్లా యస్.ఐ. యం.వీరాంజనేయులు మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు.
ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 ప్రముఖులకు స్వామి వివేకానంద జాతీయ ప్రతిభా పురస్కారాలు ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హ్యుమన్ రైట్స్ ఏపీ హై కోర్ట్ అడ్వకేట్ కె.జె. రాజు, ఏపీ జానపద సంక్షేమ సంఘం అధ్యక్షులు మిరియాల వెంకట రమణయ్య, డాక్టర్ కె.ఆర్.జి. శేషుకుమార్ నగర ప్రముఖులు, సామాజిక వేత్తలు, సాహితీవేత్తలు హాజరైయ్యారు. జె.ఎం.జె. కూచిపూడి అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆహుతులను అలరించాయి.