సొరకాయ జ్యూస్ (bottle gourd juice) ఆరోగ్యానికి మంచిదని చాలా మంది రోజూ తాగుతుంటారు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది అనే నమ్మకంతో దీనిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటారు. అయితే ఇటీవల సొరకాయ జ్యూస్ విషయంలో జాగ్రత్త అవసరమని ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ( ICMR warning) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా చేదుగా ఉన్న సొరకాయ జ్యూస్ తాగడం ప్రాణాపాయానికి దారి తీస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇటీవల ఢిల్లీలో ఒకరు, ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు చేదు సొరకాయ జ్యూస్ తాగిన తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందిన ఘటనలు సంచలనం సృష్టించాయి. దీనిపై వైద్య నిపుణులు పరిశీలించగా, సొరకాయలో సహజంగా ఉండే ‘టెట్రాసైక్లిక్ ట్రైటెర్పినాయిడ్’ అనే విషపదార్థం అధికంగా ఏర్పడినప్పుడు ఇది శరీరానికి హానికరంగా మారుతుందని గుర్తించారు. సాధారణంగా సొరకాయ రుచిలో చేదు లేకుండా ఉంటుంది. కానీ వాతావరణ మార్పులు, అధిక పురుగుమందుల వినియోగం, సరైన పద్ధతుల్లో సాగు చేయకపోవడం, ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వంటి కారణాలతో కొన్నిసార్లు సొరకాయలో విషపదార్థాల మోతాదు పెరుగుతుంది. అటువంటి సొరకాయ రుచిలో తీవ్రమైన చేదుగా ఉంటుంది.
దీనితో చేసిన జ్యూస్ తాగితే వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు, డీహైడ్రేషన్, రక్తపోటు తగ్గడం, కాలేయం మరియు కిడ్నీలపై ప్రభావం వంటి ప్రమాదకర సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ విషానికి ఇప్పటివరకు ప్రత్యేకమైన విరుగుడు లేదని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ముందస్తు జాగ్రత్తలే ఉత్తమ రక్షణ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.
సొరకాయ జ్యూస్ తయారు చేసే ముందు తప్పనిసరిగా చిన్న ముక్కను రుచి చూడాలి. స్వల్పంగా కూడా చేదు అనిపిస్తే వెంటనే దానిని పారవేయాలి. చేదు సొరకాయను వండినా, జ్యూస్ చేసినా విషపదార్థం పూర్తిగా తగ్గదని గుర్తుంచుకోవాలి. మార్కెట్‌లో కొనుగోలు చేసే సొరకాయలు తాజాగా ఉన్నాయా, పాడైపోలేదా అన్నది పరిశీలించాలి. ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన సొరకాయలను జ్యూస్‌కు వాడకపోవడం మంచిది.
గర్భిణీలు, పిల్లలు, వృద్ధులు మరియు ఇప్పటికే ఆరోగ్య సమస్యలున్న వారు సొరకాయ జ్యూస్‌ను తరచుగా తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవడం అవసరం. ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో తీసుకునే ఆహారం, పానీయాలు కొన్నిసార్లు నిర్లక్ష్యం వల్ల ప్రమాదంగా మారుతాయని ఈ ఘటనలు గుర్తు చేస్తున్నాయి. కాబట్టి సొరకాయ జ్యూస్ తాగేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించి, చేదుగా ఉన్న సొరకాయను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.