గుంటూరు జిల్లా అమరావతి అభివృద్ధికి మరోసారి వేగం అందుతోంది. చాలా కాలంగా నిలిచిపోయిన రాజధాని నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. మొత్తం 16,666 ఎకరాల విస్తీర్ణంలో భారీ మార్పులకు ప్రభుత్వం పథకాలు ఖరారు చేసింది. అమరావతిని Next Generation Growth ఒక కేంద్రంగా మార్చేందుకు మెగా ప్రాజెక్టులతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఇందులో అత్యంత కీలకంగా ‘గ్లోబల్ స్పోర్ట్స్ సిటీ’ ఏర్పాటు, కొత్త రైల్వే నెట్వర్క్ నిర్మాణం, మెట్రో కనెక్షన్, విస్తృత రోడ్ల నిర్మాణం, భారీ సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రపంచస్థాయి క్రీడా నగరాన్ని అమరావతిలో నిర్మించేందుకు విస్తృత ప్రణాళిక సిద్ధమైంది. ఒలింపిక్ స్థాయి స్టేడియం, క్రికెట్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, అంతర్జాతీయ ట్రైనింగ్ సెంటర్లు, స్పోర్ట్స్ అకాడమీలు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉండనున్నాయి.
ఈ క్రీడా నగరం ద్వారా భారీ పెట్టుబడులు సంపాదించడంతో పాటు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. ఇదే సమయంలో అమరావతికి కొత్త రైల్వే నెట్వర్క్ ద్వారా దేశంలోని ప్రముఖ నగరాలతో నేరుగా కనెక్టివిటీ ఇవ్వబోతోంది. గుంటూరు–విజయవాడ–అమరావతి–విశాఖపట్నం మార్గాలతో పాటు హైదరాబాద్, చెన్నై నగరాలకు హైస్పీడ్ రైలు సేవలను కల్పించే అవకాశాలు పరిశీలనలో ఉన్నాయి.
అదనంగా మెట్రో రవాణా ప్రణాళిక కూడా సిద్ధమవుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే సాగునీటి రంగంలో ఆధునిక సాంకేతికతతో నీటి వనరులను అభివృద్ధి చేయడం, డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థ అమలు చేయడం ద్వారా వ్యవసాయ రంగానికి బలమైన మద్దతు ఇవ్వబోతోంది. అమరావతిని స్మార్ట్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు స్మార్ట్ రోడ్లు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పర్యావరణ అనుకూల వ్యవస్థలకు పెద్దపీట వేస్తోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని అమరావతిని ప్రపంచ పటంలో నిలబెట్టడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. రాజధాని అభివృద్ధి మరోసారి పుంజుకోవడంతో ప్రజల్లో కొత్త ఆశలు మెరుగుపడుతున్నాయి. చాలా కాలం తర్వాత నిజమైన అభివృద్ధి ప్రారంభం కానుందన్న నమ్మకం పెరుగుతోంది.