ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందింది. విజయవాడ–చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలను రైల్వేశాఖ మరింత విస్తరించింది. ఇప్పటి వరకు ఈ రైలు విజయవాడ నుంచి చెన్నై మధ్య మాత్రమే నడుస్తుండగా, ఇప్పుడు ప్రజల డిమాండ్ మేరకు దీన్ని నర్సాపురం వరకు పొడిగించాలని నిర్ణయించింది. డిసెంబర్ 15 నుంచి కొత్త మార్పులు అమల్లోకి రానున్నట్లు రైల్వేస్ ప్రకటించింది. ఈ విషయాన్ని నర్సాపురం ఎంపీ మరియు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు అధికారికంగా వెల్లడించారు. ఈ నిర్ణయంతో గోదావరి జిల్లా ప్రజలకు నేరుగా వందే భారత్ సర్వీసులు అందుబాటులోకి రావడం పట్ల ఆనందం వ్యక్తమవుతోంది.
కొత్తగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, డిసెంబర్ 15 నుంచి నర్సాపురం–చెన్నై వందే భారత్ రైలు నర్సాపురం స్టేషన్ నుంచి సాయంత్రం 2.50 గంటలకు బయల్దేరుతుంది. అనంతరం 3.19కు భీమవరం, 4.04కు గుడివాడ, 4.50కు విజయవాడ చేరుతుంది. అక్కడి నుంచి 5.19కు తెనాలి, 6.29కు ఒంగోలు, 7.39కు నెల్లూరు, 8.49కు గూడూరు, 9.54కు రేణిగుంట చేరుకుని, రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. గోదావరి జిల్లాల నుంచి చెన్నై వంటి మెట్రో నగరానికి వేగవంతమైన రైలు కనెక్టివిటీ అందుబాటులోకి రావడం అభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నారు.
నర్సాపురం వరకు వందే భారత్ పొడగించాలని గత కొన్ని నెలలుగా ప్రజలు భారీగా డిమాండ్ చేశారు. ఈవిషయం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసరావు దృష్టికి వెళ్లిన వెంటనే, ఆయన స్వయంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను సంప్రదించి రైలు పొడిగింపు ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అనుమతి వచ్చినప్పటికీ, ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే clarity కోసం స్థానికులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పుడు షెడ్యూల్ అధికారికంగా వెలువడడంతో, ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తున్నారు.
అంతేకాకుండా, కేంద్ర మంత్రికి చెందిన చొరవతో గత కొన్ని నెలల్లో నర్సాపురం రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లకు కొత్త హాల్ట్ సౌకర్యాలు కల్పించారు. దీంతో ప్రయాణికుల రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడింది. ఇప్పుడు వందే భారత్ పొడిగింపు నిర్ణయం మరింత అభివృద్ధికి దోహదపడనుందని నర్సాపురం ప్రజలు భావిస్తున్నారు. రైల్వే శాఖ ఈ ప్రాంతాన్ని ముఖ్య రైల్వే హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోందని స్థానిక ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు.