ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రూపొందిన ఈ వ్యవస్థలో అనేక లోపాలు వెలుగుచూశాయని, ప్రజా సేవల పంపిణీలో అనవసరమైన ఆలస్యం జరుగుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించే ప్రక్రియ ప్రారంభించింది. ఈ క్రమంలోనే రెవెన్యూ శాఖ సేవలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణపై ముఖ్యమైన సర్క్యులర్ విడుదలైంది.
కొత్త ఆదేశాల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్లు మరియు వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ఇకపై రెవెన్యూ సంబంధిత దరఖాస్తులను నేరుగా స్వీకరించి ప్రాసెస్ చేయవచ్చు. దీనికి VRO, WRS లేదా సర్వేయర్ వంటి అధికారులు ముందుగా పరిశీలించాలన్న పాత విధానం అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొందరు సచివాలయ ఉద్యోగులు రెవెన్యూ దరఖాస్తులను స్వీకరించకుండా నిరాకరిస్తున్నారని, అధికారి అనుమతి లేకుండా దరఖాస్తులను అంగీకరించడంలేదని వచ్చిన ఫిర్యాదులు ప్రభుత్వం దృష్టికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
సచివాలయ వ్యవస్థ అసలు లక్ష్యం పౌరులకు తక్షణ సేవలను అందించడం, వారి ఇళ్లకు దగ్గరగా పరిపాలనా సౌకర్యాలు కల్పించడం. అయితే మధ్యవర్తి అధికారుల సూచనలు లేకుండా దరఖాస్తులను స్వీకరించరన్న నియమం కారణంగా ప్రజలు తిరగాల్సి రావడం, అనవసర సమయం వృథా కావడం ప్రభుత్వం అభిప్రాయపడింది. అందుకే ఈ సారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఏ పౌరుడు సచివాలయానికి వచ్చినా అతని దరఖాస్తును వెంటనే స్వీకరించి, నిర్దిష్టంగా ప్రాసెస్ చేయాలనీ, తిరస్కరించడం లేదా ఆలస్యం చేయడం పూర్తిగా నిషేధమని తెలిపింది.
ఒకవేళ ఈ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం హెచ్చరించింది. జిల్లా కలెక్టర్లు ఈ మార్గదర్శకాలు వెంటనే అమల్లోకి రావడానికి బాధ్యత తీసుకోవాలని చెప్పింది. అలాగే జిల్లా GSWS అధికారులు, DDOలు, మునిసిపల్ స్థాయి MGO/UGOలు తమ పరిధిలోని అన్నీ సచివాలయాల్లో ఈ నిర్ణయాలు పాటించబడుతున్నాయో లేదో పరిశీలించాలని సూచించింది.
ఈ నిర్ణయంతో ప్రజలకు సేవలు మరింత వేగంగా, ఇబ్బందుల్లేకుండా అందే అవకాశముంది. ముఖ్యంగా ఆదాయ ధ్రువపత్రం, రేషన్ సమస్యలు, భూమి సంబంధిత వివరణ పత్రాలు, మ్యూటేషన్ తదితర రెవెన్యూ సేవలు త్వరితంగా పూర్తికావచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. సచివాలయ వ్యవస్థలో మార్పులకు ఇది తొలి పెద్ద అడుగు కావడంతో, రాబోయే రోజుల్లో ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి.