గూగుల్ తాజాగా ప్రకటించిన అండ్‌రాయిడ్ అత్యవసర సేవల ఫీచర్ ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి ప్రాణాలను కాపాడే విధానాలను వేగవంతం చేయడానికి కొత్త దారిని చూపుతున్నది. ‘ఎమర్జెన్సీ లైవ్ వీడియో’ పేరుతో విడుదలైన ఈ ఫీచర్, అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోరుతున్న వ్యక్తి దగ్గరున్న ఫోన్ నుంచి నేరుగా ప్రత్యక్ష వీడియోను రెస్పాండర్లకు పంపించేందుకు వీలు కల్పిస్తుంది. మాటల్లో వివరించలేని సందర్భాల్లో దృశ్య సమాచారమే పెద్ద సహాయంగా మారుతుందన్న ఆలోచనతో గూగుల్ ఈ వ్యవస్థను రూపొందించింది.
ఇక్కడ ప్రత్యేకమైన సెటప్ అవసరం లేకుండా, అండ్‌రాయిడ్ ఎమర్జెన్సీ లోకేషన్ సర్వీస్ (ELS) ఆధారంగా ఫీచర్ పనిచేస్తుంది. అత్యవసర కాల్ లేదా మెసేజ్ సమయంలో డిస్పాచర్‌కి పరిస్థితి స్పష్టంగా అర్థం కావడానికి వీడియో అవసరం అనిపిస్తే, వారు వినియోగదారుడి ఫోన్‌కు లైవ్ వీడియో రిక్వెస్ట్ పంపగలరు. ఆ సమయంలో ఫోన్ స్క్రీన్‌పై కనిపించే ప్రాంప్ట్‌ను ఒక ట్యాప్‌తో అంగీకరించగానే వీడియో ప్రసారం ప్రారంభమవుతుంది. వినియోగదారుడు ఎప్పుడైనా స్ట్రీమ్‌ను ఆపే అవకాశం కూడా ఉంది. వీడియో పూర్తిగా ఎన్క్రిప్షన్‌తో రక్షించబడుతుందని గూగుల్ స్పష్టం చేస్తోంది.
అత్యవసర సేవలు చేరుకునేంత వరకూ బాధితుడి పరిస్థితి, ప్రమాద స్థాయిని అంచనా వేయడంలో ఈ ప్రత్యక్ష దృశ్యాలు కీలకం అవుతాయని సంస్థ చెబుతోంది.ఎమర్జెన్సీ లైవ్ వీడియో, అండ్‌రాయిడ్‌లోని ఫ్యూజ్డ్ లోకేషన్ ప్రొవైడర్ టెక్నాలజీని ఆధారంగా చేసుకుని పనిచేస్తుంది. GPS, సెల్యులర్ టవర్లు, వైఫై, ఫోన్‌లోని వివిధ సెన్సర్లు నుంచి వచ్చే సంకేతాలను కలిపి వినియోగదారుడి ఖచ్చితమైన స్థానం గుర్తించడంలో ఈ వ్యవస్థ మరింత వేగంగా పనిచేస్తుందని గూగుల్ వివరిస్తోంది. ఇది 8 లేదా అంతకంటే పై వెర్షన్లు కలిగిన, గూగుల్ ప్లే సర్వీసులు అండ్‌రాయిడ్ అందుబాటులో ఉన్న డివైసుల్లో మాత్రమే అందుబాటులోకి వస్తోంది.
ప్రస్తుతం ఈ సేవ అమెరికా, జర్మనీ, మెక్సికో వంటి దేశాల్లో దశలవారీగా విడుదల అవుతోంది. త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని గూగుల్ సంకేతాలు ఇస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో సహాయానికి ఇప్పటికే అందుబాటులో ఉన్న కార్ క్రాష్ డిటెక్షన్, ఫాల్ డిటెక్షన్, సాటిలైట్ SOS వంటి సేవలకు ఇది కొత్త అదనంగా చేరింది.
అత్యవసర సమయాల్లో పరిస్థితిని స్పష్టంగా చెప్పడం కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఈ లైవ్ వీడియో వ్యవస్థ, బాధితుడి ప్రాణాలను త్వరగా కాపాడేందుకు పెద్ద పాత్ర పోషించగలదు. గూగుల్ అండ్‌రాయిడ్ ఎకోసిస్టమ్ అధ్యక్షుడు సమీర్ సమత్, “అత్యవసర వేళల్లో నిమిషాలు కాదు సెకండ్లూ కీలకం. అందుకే వినియోగదారులు ఉన్నచోటేమి జరుగుతున్నదో రెస్పాండర్లు ప్రత్యక్షంగా చూడగలిగే విధంగా ఈ ఫీచర్ రూపొందించాం’’ అని వివరించారు.
టెక్నాలజీ ఆధారంగా అత్యవసర సేవలు మరింత వేగవంతం, వినియోగదారుల భద్రతపై కేంద్రీకృతమవుతున్న తరుణంలో, గూగుల్ తీసుకొచ్చిన ఈ కొత్త మార్పు భవిష్యత్తులో ప్రాణరక్షణ విధానాలను పూర్తిగా మార్చే సామర్థ్యం కలిగి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.