డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. వీటిలో విటమిన్ E, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. పీచు అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. అయితే డ్రైఫ్రూట్స్‌ను ఎలా తింటున్నామో కూడా చాలా ముఖ్యం. తప్పుగా తీసుకుంటే అందులోని పోషకాలు తగ్గిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు.
చాలామంది డ్రైఫ్రూట్స్‌ను వేయించి, ఉప్పు లేదా కారం కలిపి తింటారు. ఈ విధంగా తినడం సరైంది కాదని డాక్టర్ మోహన్‌వంశీ అంటున్నారు. ఈ ప్రక్రియలో నట్స్‌లోని సహజ పోషకాలు దెబ్బతింటాయి. పైగా, ఉప్పు ఎక్కువయితే సోడియం పెరిగి ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అందుకే సహజ రూపంలోనే వాటిని తీసుకోవడం మంచిదని నిపుణులు చెప్పుతున్నారు.
డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివని కొందరు ఎక్కువ మొత్తంలో తినడం కూడా పొరపాటే. ఏ పోషకపదార్థమైనా మితంగా తీసుకోవడం మంచిదని డాక్టర్ మోహన్‌వంశీ సూచిస్తున్నారు. ఉదయం అల్పాహారంలోనుగానీ, మధ్యాహ్నం భోజనం తర్వాత గానీ లేదా సాయంత్రం స్నాక్‌గా నట్స్‌ను తీసుకోవచ్చు. కానీ పరిమితి తప్పక పాటించాలి.
డ్రైఫ్రూట్స్‌ను నానబెట్టుకుని తినడం ఆరోగ్యానికి మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 5–6 బాదం, 2–3 వాల్‌నట్స్ నానబెట్టి తీసుకుంటే శరీరానికి బాగా ఉపయోగపడుతుంది. నానబెట్టడం వల్ల అందులోని ఎంజైమ్ ఇన్హిబిటర్లు తొలగిపోతాయి, ఫైబర్ మెత్తబడుతుంది, జీర్ణం సులభమవుతుంది. పైగా, పోషకాలు శరీరం మరింత వేగంగా గ్రహించగలదు. బాదం, వాల్‌నట్, ఎండుద్రాక్ష వంటి వాటిని నానబెట్టి తినడం ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.
కొన్ని డ్రైఫ్రూట్స్‌లో ఉండే హానికర పదార్థాలు కూడా నానబెట్టే ప్రక్రియలో తొలగిపోతాయి. ఉదాహరణకు, అంజీర్‌ను నానబెట్టి ఉదయం ఖాళీకడుపుతో తింటే మలబద్ధకం తగ్గుతుంది. డ్రైఫ్రూట్స్‌ను సరిగ్గా తీసుకోవడం వలన ఆరోగ్యానికి మరింత ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా వైద్యుల సలహా తీసుకోవడమే ఉత్తమం.