ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, స్కాలర్‌షిప్‌లు, రేషన్, ఆరోగ్య సేవలు వంటి అనేక కీలక సౌకర్యాలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. చిన్న వయసులో ఆధార్ తీసుకున్నా, కాలక్రమంలో దాన్ని అప్‌డేట్ చేయకపోతే సేవలు నిలిచిపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐదేళ్లు దాటిన పిల్లలు, అలాగే 15 ఏళ్లలోపు ఉన్నవారు తప్పనిసరిగా ఆధార్ అప్‌డేట్ చేయించుకోవాలని UIDAI స్పష్టం చేసింది. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వ ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు జారీ చేసే ‘బాల ఆధార్’లో బయోమెట్రిక్ వివరాలు ఉండవు. ఇందులో పిల్లల పేరు, పుట్టిన తేదీ, ఫొటో మాత్రమే నమోదు చేసి, తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. అయితే పిల్లలకు ఐదేళ్లు నిండిన వెంటనే వారి వేలిముద్రలు (ఫింగర్ ప్రింట్స్), కళ్ల ఐరిస్ వివరాలతో బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇది ఆధార్ వివరాలు ఖచ్చితంగా ఉండేందుకు, భవిష్యత్తులో గుర్తింపు సమస్యలు రాకుండా ఉండేందుకు ఎంతో కీలకం.
అలాగే 15 సంవత్సరాలలోపు పిల్లలు మరోసారి ఆధార్ అప్‌డేట్ చేయించుకోవాలని UIDAI సూచిస్తోంది. ఈ దశలో పేరు, చిరునామా, ఫొటో, బయోమెట్రిక్ వివరాలు సరిచూసుకుని ఈ-కేవైసీ ద్వారా అప్‌డేట్ చేయాలి. చాలామంది ఏళ్ల తరబడి ఆధార్ అప్‌డేట్ చేయకపోవడంతో పలు ప్రభుత్వ పథకాలు నిలిచిపోతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అందుకే తల్లిదండ్రులు ముందుగానే జాగ్రత్త తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ క్రమంలో UIDAI రాష్ట్రవ్యాప్తంగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయని పిల్లల వివరాలను సేకరించింది. ఈ జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా పంపించింది. తల్లిదండ్రులు తమ ప్రాంతంలోని సచివాలయ సిబ్బందిని సంప్రదించి పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రక్రియను పూర్తి చేయాలి. అదేవిధంగా ప్రజలకు సౌలభ్యం కల్పించేందుకు ప్రత్యేక ఆధార్ శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిబిరాల్లో ఆధార్ అప్‌డేట్‌ను వేగంగా, సులభంగా పూర్తిచేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం అందించే సేవలు నిరంతరంగా అందాలంటే ఆధార్ అప్‌డేట్ విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకూడదని అధికారులు సూచిస్తున్నారు.