ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణలో పునాది స్థాయిలో పనిచేసే బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వో), బీఎల్‌వో సూపర్‌వైజర్లకు శుభవార్త చెప్పింది. వారి సేవలను గుర్తిస్తూ వార్షిక గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన పారితోషికం 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వేలాది బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు ఆర్థిక ఊరట లభించనుంది.
కొత్త ఉత్తర్వుల ప్రకారం బూత్ లెవల్ అధికారులకు సంవత్సరానికి రూ.12 వేల పారితోషికం చెల్లించనున్నారు. ఇదే విధంగా బీఎల్‌వో సూపర్‌వైజర్లకు ఏడాదికి రూ.18 వేల గౌరవ వేతనం అందించనున్నారు. అంతేకాకుండా సమ్మరీ రివిజన్ (SSR/ESR) లేదా ఇతర ప్రత్యేక ఓటరు నమోదు డ్రైవ్‌లలో పనిచేసే బీఎల్‌వోలకు అదనంగా రూ.2 వేల ప్రోత్సాహకం కూడా ఇవ్వనున్నారు. ఏడాది మొత్తంగా సేవలందించిన వారికి పూర్తి పారితోషికం అందించగా, కొంతకాలం మాత్రమే విధులు నిర్వహించిన వారికి పని చేసిన కాలానికి అనుగుణంగా వేతనం చెల్లించనున్నారు.
ఎన్నికల ప్రక్రియలో బీఎల్‌వోల పాత్ర అత్యంత కీలకమైనది. ఓటర్ల జాబితాల తయారీ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన లేదా అర్హత లేని ఓటర్ల తొలగింపు, చిరునామా మార్పుల నమోదు వంటి బాధ్యతలు ప్రధానంగా వీరే నిర్వహిస్తారు. వీరి పనితీరు సరిగ్గా ఉంటేనే ఎన్నికలు పారదర్శకంగా, న్యాయంగా జరుగుతాయి. అలాగే బీఎల్‌వో సూపర్‌వైజర్లు తమ పరిధిలోని బీఎల్‌వోల పనిని పర్యవేక్షిస్తూ, ఎన్నికల అధికారులకు సమన్వయంగా పనిచేస్తారు. ఈ నేపథ్యంలో వారి సేవలను గౌరవిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గతంలో బీఎల్‌వోలకు సంవత్సరానికి కేవలం రూ.6 వేలే పారితోషికంగా చెల్లించేవారు. అలాగే సూపర్‌వైజర్లకు రూ.12 వేలు మాత్రమే అందేది. ప్రత్యేక డ్రైవ్‌లలో పనిచేసిన వారికి అదనంగా రూ.1,000 ప్రోత్సాహకం ఇచ్చేవారు. తాజా ఉత్తర్వులతో ఈ మొత్తాలు రెట్టింపు కావడంతో పాటు ప్రత్యేక డ్రైవ్ ప్రోత్సాహకం కూడా పెరిగింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మార్పులు చేపట్టగా, ఆర్థిక శాఖ కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా ఈ నిర్ణయంతో బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లలో సంతృప్తి వ్యక్తమవుతోంది.