ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఉచితంగా త్రిచక్ర మోటారు వాహనాలను అందించే పథకాన్ని ప్రారంభించింది. దివ్యాంగులు చదువు, ఉపాధి, వ్యవసాయం వంటి రంగాల్లో మరింత ముందుకు సాగేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకానికి అర్హులైన వారి నుంచి ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి.
ఈ పథకానికి అర్హత పొందడానికి దివ్యాంగులకు కనీసం 70 శాతం వైకల్య ధ్రువపత్రం ఉండాలి. వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండడం తప్పనిసరి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఇప్పటికే ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల ద్వారా మోటారు వాహనాలను పొందినవారు ఈ పథకానికి అర్హులు కారని స్పష్టం చేశారు. జీవితంలో ఒకే సారి ఈ త్రిచక్ర వాహనం మంజూరు చేయబడుతుంది.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 10 వాహనాలు కేటాయించారు. వీటిలో 50 శాతం మహిళలకు రిజర్వ్ చేశారు. ఒక్కో వాహనం విలువ రూ.1.30 లక్షలు కాగా పూర్తిగా ఉచితంగా అందిస్తారు. ఈ పథకానికి 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో దరఖాస్తు చేసి వాహనం మంజూరు కాకపోయిన వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆధార్ కార్డు, దివ్యాంగుల ధ్రువపత్రం, పదోతరగతి మార్కుల జాబితా, కుల ధ్రువపత్రం, ఆదాయ ధ్రువపత్రం, పాస్‌పోర్టు సైజు ఫోటో, గతంలో వాహనం పొందలేదని స్వీయ ధ్రువీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లను సమర్పించాలి. అధికారులు ఈ పత్రాలను పరిశీలించి అర్హులైన వారికి త్రిచక్ర వాహనాలను మంజూరు చేస్తారు.
దివ్యాంగులు ఈ నెల 25 లోపు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం రూపొందించిన అధికారిక వెబ్‌సైట్ apdascac.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు స్వయం ఉపాధి, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ముందుకు సాగేందుకు మంచి అవకాశాన్ని ప్రభుత్వం అందిస్తోంది.