కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 549 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పురుషులకు 277 పోస్టులు, మహిళలకు 272 పోస్టులు కేటాయించారు. పదో తరగతి అర్హతతో పాటు క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణత పొందినవారై ఉండాలి. అంతేకాదు, గత రెండేళ్లలో గుర్తింపు పొందిన క్రీడల్లో ప్రావీణ్యం కనబరిచినవారికి అర్హత ఉంటుంది. అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, హాకీ, స్విమ్మింగ్, షూటింగ్, జూడో, కరాటే, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, సైక్లింగ్, వాటర్ స్పోర్ట్స్, ఉషు వంటి అనేక క్రీడా విభాగాల్లో అంతర్జాతీయ స్థాయిలో బంగారు, వెండి లేదా కాంస్య పతకాలు సాధించినవారికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నవారికి కూడా అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన లేదా పాల్గొన్న అభ్యర్థులకు రెండో ప్రాధాన్యం కల్పిస్తారు.
ఫిజికల్ స్టాండర్డ్స్ విషయంలో నోటిఫికేషన్‌లో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. పురుషుల ఎత్తు కనీసం 170 సెంటీమీటర్లు, మహిళల ఎత్తు 157 సెంటీమీటర్లు ఉండాలి. పురుషుల ఛాతీ 80 సెంటీమీటర్లు ఉండి, శ్వాస తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు విస్తరించాలి. ఎస్టీ అభ్యర్థులకు ఛాతీ పరిమాణం 76 సెంటీమీటర్లు ఉండాలి. ఎత్తు, వయసుకు అనుగుణంగా బరువు కూడా ఉండాలి. అభ్యర్థుల గరిష్ట వయస్సు 23 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయో సడలింపు వర్తిస్తుంది.
అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 1, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.159 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఈ నియామక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం చెల్లించనున్నారు.