వారం రోజులు గ్యాప్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మళ్లీ మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన కీలక వాతావరణ మార్పుల వల్ల రాబోయే రోజుల్లో ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోందనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం బంగాళాఖాతంలో, ముఖ్యంగా శ్రీలంక కింద రెండు అల్పపీడనాలు ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. అయితే, నవంబర్ 18వ తేదీ నాటికి అవి ఒకటే బలమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది అండమాన్ నికోబార్ తీరం వైపు పయనించినా, దాని ప్రభావం ఏపీ, తెలంగాణపై ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత వాతావరణ శాఖ (IMD) మరియు తాజా శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం తెలుగు రాష్ట్రాలలో వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి:
IMD ప్రకారం, ఆంధ్రప్రదేశ్, యానాం మరియు రాయలసీమ ప్రాంతాల్లో నవంబర్ 17, 18 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల పడతాయి. కోస్తాంధ్ర, యానాం మరియు రాయలసీమలో 17 నుంచి 20 వరకూ ఉరుములు, మెరుపులు అక్కడక్కడ వస్తూనే ఉంటాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది.
ఈ రోజు తూర్పు రాయలసీమ (చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, ఒంగోలు, కడప, నెల్లూరు జిల్లాల) వరకూ మధ్యాహ్నం తర్వాత మేఘాలు ఆవరిస్తాయి. అయితే ఎక్కడా పెద్దగా వర్షం పడే సూచన లేదు. తిరుపతిలో మాత్రం రాత్రి తర్వాత చినుకులు పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీలో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి.
IMD సోమవారం (నవంబర్ 17) తెలంగాణలో వర్షాలు పడతాయని చెప్పలేదు. శాటిలైట్ అంచనాల్ని గమనిస్తే, ఈ రోజు తెలంగాణలో పూర్తిగా ఎండ వాతావరణం ఉంటుంది. వర్షం పడకపోయినా, చలి మాత్రం విపరీతంగా పెరుగుతుంది. ఈ రాత్రికి చలి ఎక్కువగానే ఉంటుంది. ఆకాశం మేఘాలు లేకుండా చాలా స్పష్టంగా ఉంటుంది.
ఉష్ణోగ్రత: తెలంగాణలో పగటివేళ ఉష్ణోగ్రత 28 C వరకు ఉంటుంది. రాత్రివేళ 16 C వరకు పడిపోతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి బాగా పెరుగుతుంది. పగటివేళ తేమ (Humidity) 34% మాత్రమే ఉంటుంది. రాత్రివేళ 77% తేమ ఉండటం వల్ల మంచు (Fog) బాగా పడుతుంది, కానీ వర్షాలు పడవు.
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న ఈ అల్పపీడనంపైనే అందరి దృష్టి ఉంది. అల్పపీడనం సుడి వేగం ప్రస్తుతం గంటకు 42 కిలోమీటర్లుగా ఉంది. ఇది వాయుగుండంగా మారేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అల్పపీడనం మన తెలుగు రాష్ట్రాలవైపు వచ్చేలా కనిపించట్లేదు. ఇది అండమాన్ వైపు వెళ్లిపోతే మనపై ప్రభావం తగ్గుతుంది.
ఒకవేళ ఇది యూటర్న్ తీసుకొని, తెలుగు రాష్ట్రాల వైపు వస్తే మాత్రం తీవ్ర ప్రభావం ఉంటుంది. ఎందుకంటే, బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్ర జలాలు చాలా వేడిగా ఉండటం వల్ల, ఈ అల్పపీడనం తుపానుగా మారేందుకు అనుకూల వాతావరణం ఉంది.
ప్రపంచ వాతావరణ గమనాలను పరిశీలిస్తే, వర్షాకాలం ఇంకా అయిపోలేదనే అనుకోవాలి. భూమధ్య రేఖా ప్రాంతం సూపర్ యాక్టివ్‌గా ఉంది. తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియాలో చాలా మేఘాలున్నాయి. అంటార్కిటికా నుంచి బలమైన గాలులతో కూడిన మఘాలు పసిఫిక్ మహా సముద్రంపైకి వస్తూనే ఉన్నాయి. ఈ పరిణామాలు మరో రెండు వారాల పాటు కొనసాగుతాయి. కాబట్టి, ఇప్పట్లో వర్షాలు పూర్తిగా తగ్గే పరిస్థితి లేదు. అప్పుడప్పుడూ వానలు పడుతూనే ఉంటాయి.