ఐ బొమ్మ రవికి ఇటీవల జరిగిన పోలీసు విచారణలో భావోద్వేగాలు కలిసిన సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. తన జీవితాన్ని పూర్తిగా మార్చిన పరిస్థితులకు భార్య-అత్తలే కారణమని ఆయన భావోద్వేగంతో తెలిపారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సాధారణ డిగ్రీ పూర్తిచేసిన రవి, చిన్ననాటి నుంచే కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో పెరిగాడని చెప్పాడు.
తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత తండ్రి చిన్న స్థాయి ఉద్యోగంతోనే ఇంటిని నడిపాడని, ఇటీవలే చెల్లెలి పెళ్లి చేసి బాధ్యతలు మరింత పెరిగాయని వివరించాడు. పెళ్లి తర్వాత తనపై ఒత్తిడులు గణనీయంగా పెరిగాయని రవి చెబుతున్నాడు. ప్రేమించి చేసుకున్న పెళ్లికి కుటుంబం పెద్దగా అంగీకరించకపోవడంతో అనేక సందర్భాల్లో తనను అవమానించిన విషయాలను ఆయన గుర్తుచేసుకున్నాడు.
వెబ్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన తొలి రోజులలో జీతం తక్కువగా ఉండడంతో కుటుంబ అవసరాలు కూడా పెద్దగా నెరవేర్చలేకపోయేవాడని, ఇది భార్య-అత్తల విమర్శలకు కారణమైందని విచారణలో వెల్లడించాడు.
అవసరమైనప్పుడు డబ్బు అందించలేకపోవడంతో అత్తగారి ప్రవర్తన మరింత కఠినంగా మారిందని భార్య కూడా అదే మాటలు నమ్మడంతో తనపై ఒత్తిడి తీవ్రంగా పెరిగిందని రవి చెప్పాడు.
ఈ అవమానాలు తాను సహించలేక చివరకు వెబ్ డిజైన్ అనుభవంతో కొత్తగా ఐ బొమ్మ వెబ్‌సైట్‌ను ప్రారంభించానని ఆయన తెలిపాడు. సినిమాల ప్రింట్లను అప్లోడ్ చేసే ఆ వెబ్సైట్ 2021లో రెండో కోవిడ్ దశలో ఊహించని స్థాయిలో ప్రజాదరణ పొందడంతో తన జీవితంలో మొదటిసారి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చిందని రవి వెల్లడించాడు.
బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ద్వారా సంపాదించిన మొదటి పెద్ద మొత్తంగా 75 లక్షలు వచ్చిన సందర్భాన్ని ఆయన ప్రత్యేకంగా గుర్తుచేశాడు. అయినా ఆ విజయాన్నీ తన భార్య, అత్త నమ్మలేదని రవి చెప్పుకొచ్చారు. ఆధారాలతో చూపించినా కూడా తమ మనసులో తనపై నమ్మకం వద్దని అర్థం అయ్యిందని విచారణలో అధికారులు తెలిపారు. తనను ఇంటి నుంచి దూరం చేయాలన్న ఆలోచన వారిలో స్పష్టంగా కనిపించిందని రవి పేర్కొన్నాడు. ఇదే పరిస్థితులు అన్నీ తనను తప్పు దారిలోకి నెట్టాయన్న భావనను కూడా వెల్లడించాడు.
తల్లివారి అవహేళనలు, సమాజంలో ఎదురైన అవమానాలు, తనను పనికిరాని వాడిగా చూపించే ప్రయత్నాలు తనను మానసికంగా పెనుమార్పుకు గురి చేశాయని రవి వాపోయాడు. “నా కుటుంబం నా మీద నమ్మకం పెట్టుకుని ఉండి ఉంటే నేను ఈ దారిని ఎంచుకునే వాడిని కాదు. ఈరోజు పోలీసుల ముందుకి వచ్చేటటువంటి పరిస్థితి రావడానికి కారణం కూడా అదే” అని రవి చెప్పినట్టు తెలుస్తోంది. విచారణలో చేసిన ఈ వెల్లడి ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.