మానవ శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది శరీరమంతా రక్తాన్ని పంపించి ప్రతి అవయవానికి ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. గుండె సరిగా పనిచేస్తేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ నేటి ఆధునిక జీవనశైలిలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించిన గుండెపోటులు (HeartAttack) , ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్ల యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి కారణంగా సరైన ఆహారం తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, శారీరక వ్యాయామం చేయకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం, ఎక్కువ ఒత్తిడితో జీవించడం వంటి అంశాలు ఉన్నాయి. ఇవే కాకుండా, చాలా చిన్నగా అనిపించే కొన్ని రోజువారీ అలవాట్లు కూడా గుండెపోటుకు కారణమవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జపాన్‌కు చెందిన కార్డియాలజిస్టులు 22 సంవత్సరాల పాటు చేసిన ఒక దీర్ఘకాలిక పరిశోధనలో ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పరిశోధన వివరాలను డాక్టర్ శ్రేయ గార్గ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ పరిశోధనలో భాగంగా ఉన్న వ్యక్తులు సాధారణ బరువు కలిగి ఉండటం, పొగ తాగకపోవడం, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర లేకపోవడం వంటి లక్షణాలు కలిగి ఉన్నారు. అయినప్పటికీ, వారు 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో గుండెపోటుకు గురయ్యారు. పరిశోధనలో వీరందరిలో ఒకే ఒక సాధారణ అలవాటు కనిపించింది. అది ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక్కసారిగా లేచి నిలబడటం.
ఉదయం నిద్రలేచిన వెంటనే సడన్‌గా లేవడం శరీరానికి హానికరం. నిద్రలేచిన వెంటనే మన మెదడు మేల్కొంటుంది కానీ శరీరం పూర్తిగా మేల్కొనడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో ఒక్కసారిగా లేచి నిలబడితే రక్తపోటు (Blood Pressure) వేగంగా పెరుగుతుంది. అలాగే ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయి ఎక్కువవుతుంది. దీనివల్ల రక్తనాళాలు సంకోచించి గుండెపై అదనపు భారాన్ని పెడతాయి. యువతలో ఇది నెమ్మదిగా ప్రభావం చూపించినా, వయస్సు పెరిగినవారిలో ఇది ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ఉదయం నిద్రలేచిన తర్వాత వెంటనే లేవకుండా, కొద్దిసేపు బెడ్‌పై కూర్చుని లేదా పక్కకు తిరిగి కూర్చుని, శరీరం పూర్తిగా మేల్కొన్న తర్వాత మెల్లగా లేవడం గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
గుండెపోటుకు కారణమయ్యే ఉదయపు అలవాటు ఏది?
నిద్రలేచిన వెంటనే ఒక్కసారిగా నిలబడటం లేదా సడన్‌గా లేవడం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
ఈ అలవాటు వల్ల గుండెకు ఎలా నష్టం జరుగుతుంది?
సడన్‌గా లేవడం వల్ల రక్తపోటు పెరగడం, కార్టిసాల్ హార్మోన్ ఎక్కువవడం, రక్తనాళాలు సంకోచించడం జరుగుతుంది. ఇవన్నీ గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి.
ఉదయం నిద్రలేచిన తర్వాత ఏం చేయాలి?
నిద్రలేచిన వెంటనే లేవకుండా కొద్దిసేపు బెడ్‌పై కూర్చుని, శరీరం పూర్తిగా మేల్కొన్న తర్వాత మెల్లగా లేవడం గుండె ఆరోగ్యానికి మంచిది.