తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో గణనీయమైన మార్పులు చేస్తూ, ఇప్పటివరకు అమలులో ఉన్న ఆఫ్‌లైన్ టికెట్ల జారీని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. జనవరి 9వ తేదీ నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు తిరుమలలో రోజుకు ఆఫ్‌లైన్ విధానంలో జారీ చేస్తున్న 800 శ్రీవాణి దర్శన టికెట్లను ఇకపై పూర్తిగా ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఈ టికెట్లు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల అవుతాయి. ఫస్ట్ కమ్ – ఫస్ట్ సర్వ్ పద్ధతిలో మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు తిరుమలలో దర్శనానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా క్యూలైన్లు తగ్గడమే కాకుండా భక్తులకు సమయపరమైన సౌలభ్యం కూడా కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
శ్రీవాణి దర్శన టికెట్ల దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు టీటీడీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. టికెట్ బుకింగ్ సమయంలో ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ ధృవీకరణ తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేసింది. ఒక కుటుంబం నుంచి గరిష్ఠంగా నలుగురు (1+3) మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ కొత్త విధానాన్ని తొలుత నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆ తర్వాత భక్తుల స్పందన ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని టీటీడీ అధికారులు తెలిపారు.
ఈ మార్పులతో పాటు ఇప్పటికే అమలులో ఉన్న కొన్ని శ్రీవాణి దర్శన టికెట్ విధానాలు యథాతథంగా కొనసాగుతాయని టీటీడీ స్పష్టం చేసింది. మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్న 500 శ్రీవాణి అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు, అలాగే తిరుపతి విమానాశ్రయంలో రోజూ ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్న 200 టికెట్లు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. భక్తులు ఈ కొత్త మార్పులను గమనించి, ముందస్తుగా తమ దర్శన ప్రణాళికలను సక్రమంగా రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఈ నిర్ణయంతో తిరుమలలో దర్శన వ్యవస్థ మరింత పారదర్శకంగా, సులభంగా మారుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.