ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం పైస్థాయి నుంచి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, క్షేత్రస్థాయిలో కలెక్టర్లు అమలు చేస్తున్న గొప్ప ఆలోచనలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే కొత్త సంస్కృతికి తెరలేపింది. గురువారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక వినూత్న పద్ధతిని అనుసరించారు. వివిధ జిల్లాల్లో సత్ఫలితాలను ఇస్తున్న ఆరు బెస్ట్ ప్రాజెక్టులను ఎంపిక చేసి, వాటిని రూపొందించిన కలెక్టర్లతోనే ఇతర జిల్లాల కలెక్టర్లకు వివరించారు. ఈ ఆరు విధానాలు రాష్ట్రాభివృద్ధిలో 'గేమ్ ఛేంజర్'లుగా మారుతాయని ఆయన ఆకాంక్షించారు.
పాలనలో వేగం ఎలా ఉండాలో చెబుతూ సీఎం ఒక ఉదాహరణను చదివి వినిపించారు. మంగళగిరిలో పవన్ అనే వ్యక్తికి కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు ఆయన సీఎంఓకు ధన్యవాదాలు తెలుపుతూ పంపిన సందేశాన్ని చూపిస్తూ.. "మనం ఈ స్థాయిలో పనిచేస్తే దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది" అని చంద్రబాబు కలెక్టర్లలో ఉత్సాహం నింపారు.
మెరికల్లా గిరిజన పిల్లలు
ప్రాజెక్టు: నిర్మాణ్ జిల్లా: అల్లూరి సీతారామరాజు
కలెక్టర్: దినేశ్ కుమార్
లక్ష్యం: గిరిజన ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచే పటిష్ఠ పునాది వేసి, మంచి గ్రేడ్ సాధించేలా చూడటం. ప్రతిభావంతులను సూపర్-50 పేరుతో ఎంపికచేసి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం. మార్గదర్శిని పేరుతో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్.
అమలు విధానం: ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్) పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. తెలుగు, ఇంగ్లిష్, గణితంలో మే నెలలో పరీక్ష నిర్వహించి, ఫలితాల మేరకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పదో తరగతి విద్యార్థులకు జిల్లాస్థాయిలో పరీక్షపెట్టి, సూపర్-50లో భాగంగా 50 మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారిలో ఒక విద్యార్థి ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 577 మార్కులతో రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల విభాగంలో మొదటి స్థానంలో నిలిచాడు. 2023-24, 2014-25లో సూపర్-50లో శిక్షణ పొందిన విద్యార్థులంతా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.
లక్ష్యం: కుప్పం నియోజకవర్గంలో 'విలువల బడి' పేరుతో నిత్యం గంటన్నర పాటు పిల్లలకు స్ఫూర్తిదాయక అంశాలు బోధిస్తున్నారు. దాన్నికూడా అన్నిచోట్లా అమలు చేయాలి.
ఆరోగ్యానికి 'ముస్తాబు' మలుపు (పార్వతీపురం మన్యం జిల్లా)
ప్రాజెక్టు పేరు: ముస్తాబు
విధానం: పాఠశాలలో ప్రతి క్లాస్ రూమ్‌లో అద్దం, దువ్వెన, సబ్బు, నెయిల్ కట్టర్ వంటి వాటితో 'ముస్తాబు కార్నర్' ఏర్పాటు. ఇంటి దగ్గర సరిగ్గా తయారు కాని పిల్లలను ఇక్కడే సిద్ధం చేసి క్లాస్‌లోకి పంపిస్తారు.
లక్ష్యం: వ్యక్తిగత శుభ్రతతో పాటు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం. రాష్ట్రంలోని 79 లక్షల మంది విద్యార్థులకు దీనిని వర్తింపజేయాలని సీఎం ఆదేశించారు.
సారా నుండి 'మార్పు' వైపు (ఏలూరు జిల్లా)
ప్రాజెక్టు పేరు: మార్పు
విధానం: ఏళ్ల తరబడి నాటు సారా తయారు చేస్తూ కేసుల్లో చిక్కుకున్న 226 కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చి, ప్రత్యామ్నాయ ఉపాధి చూపడం.
ఫలితం: దాదాపు 40 కుటుంబాలు పశువుల పెంపకం, కుండల తయారీ వంటి పనులు చేస్తూ నెలకు రూ. 15 వేల వరకు సంపాదిస్తున్నాయి. వ్యసనాలకు బానిసలైన వారిని కూడా ఇలాగే మార్చాలని సీఎం సూచించారు.
ప్రాజెక్టు: ఛాంపియన్ ఫార్మర్స్
జిల్లా: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
కలెక్టర్: హిమాంశు శుక్లా
లక్ష్యం: అందుబాటులో ఉన్న జల వనరులతోనే సాగు విస్తీర్ణం పెంచడం. వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం. ఎరువులు, క్రిమిసంహారకాల వాడకం తగ్గించడం.
అమలు విధానం: 727 పంచాయతీల నుంచి ఒక్కో ఛాంపియన్ ఫార్మర్ను ఎంపిక చేశారు. జిల్లాలోని మధ్య ప్రాంతంలో మొక్కజొన్న, పశ్చిమ ప్రాంతంలో వేరుశనగ, నిమ్మ, డెల్టాలో వరికి బదులు సీవీడ్, ఆక్వా, అరటి, పొలం గట్లపై ఆయిల్పాం సాగును ప్రోత్సహించారు. యాంత్రీకరణ కింద 45 పరికరాలను రాయితీపై అందిస్తున్నారు.
సీఎం సూచన: రైతులు మూణ్నాలుగు రకాల పంటలు వేస్తారు. వాటిని వేర్వేరు విభాగాలు పర్యవేక్షిస్తాయి. వాటి మధ్య సమన్వయం లోపిస్తోంది. ఆ సమస్యకు ఇదొక పరిష్కారం. జిల్లా కేంద్రంగా వ్యవసాయ పరికరాల బ్యాంక్ ఏర్పాటుచేసి, రైతులు వాడుకునేలా పర్యవేక్షించాలి.
ఆహారం.. శుచిగా, శుభ్రంగా, రుచిగా
పథకం: మధ్యాహ్న భోజన పథకానికి ఆధునిక వంటశాలలు
జిల్లా: వైఎస్సార్ కడప
కలెక్టర్: చెరుకూరి శ్రీధర్
లక్ష్యం: మధ్యాహ్న భోజన పథకంలో శుచి, శుభ్రత, నాణ్యత, ప్రమాణాలు పెంచడం. పిల్లలకు పోషకాహారాన్ని అందించడం. పర్యావరణహిత వంటశాలలు.
అమలు విధానం: మండలానికి ఒక ఆధునిక వంటశాల ఏర్పాటు చేశారు. అక్కడే సౌర విద్యుత్, బయోగ్యాస్పై ఆహార పదార్థాలు వండి, పాఠశాలలకు పంపిస్తున్నారు. వంటవారికి పౌష్టికాహార నిపుణులతో శిక్షణ ఇప్పించారు. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల నుంచే సరకులు కొంటున్నారు. గతంలో రేషన్ బియ్యం సరఫరాకు వాడిన వాహనాలను స్కూళ్లకు ఆహార పదార్థాల సరఫరాకు వినియోగిస్తున్నారు.
ప్రస్తుతం రోజూ 136 స్కూళ్లలోని పది వేల మందికి భోజనం అందిస్తున్నారు. మరో 33 వంటశాలలు నిర్మాణంలో ఉన్నాయి. జనవరి 26 నాటికి జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈ వంటశాలల నుంచే ఆహారం పంపిస్తారు. దీన్ని నీతి ఆయోగ్ మెచ్చుకుని వంటశాలల నిర్మాణానికి రూ.2.5 కోట్లు ఇచ్చింది. ఒక్కో వంటశాల నిర్మాణానికి రూ.62 లక్షలు ఖర్చవుతోంది.
సీఎం సూచన: వంట దినుసుల్లో అన్యపదార్థాల్ని తొలిగించేందుకు తితిదేలో వాడుతున్న ఏఐ ఆధారిత పరిజ్ఞానాన్ని పరిశీలించండి. పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయించండి. అవసరమైన సప్లిమెంట్లను ఆహారం ద్వారా ఇవ్వాలి. రక్తహీనతను నివారించాలి.
డిజిటల్ రెవెన్యూ రికార్డులు (అనంతపురం జిల్లా)
విధానం: భూములకు సంబంధించిన పాత రికార్డులన్నింటినీ కేవలం రూ. 3 లక్షలతో స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో పెట్టారు. ఏఐ (AI) సాయంతో ఒకే వెబ్‌సైట్‌లో రికార్డులు అందుబాటులోకి వచ్చాయి.
ప్రయోజనం: రికార్డుల ట్యాంపరింగ్ జరగకుండా పారదర్శకత పెరుగుతుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. "ప్రజలకు సేవ చేయడంలో మనం ఒక మోడల్‌గా మారాలి. ఇతర రాష్ట్రాల వారు వచ్చి మన దగ్గర నేర్చుకునేలా మన విధానాలు ఉండాలి" అని దిశానిర్దేశం చేశారు. వచ్చే సదస్సు నాటికి ఇలాంటి వినూత్న విధానాల సంఖ్య 10కి పెరగాలని ఆయన లక్ష్యంగా నిర్దేశించారు.
క్షేత్రస్థాయి కలెక్టర్ల ఆలోచనలకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించడం వల్ల పాలనలో జవాబుదారీతనం పెరగడమే కాకుండా, ప్రజలకు సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందుతాయని ఆశిద్దాం.