హైదరాబాద్- విజయవాడ (ఎన్హెచ్-65) రహదారిని నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలుగా మార్చడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సిద్ధమైనా పనులు ఇప్పట్లో జరిగేలా లేవు. ఈ రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యం కావడంతో ఈ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా మార్చడానికి మూడేళ్ల కిందటే అడుగులు పడ్డాయి.
అందుకు అనుగుణంగా డీపీఆర్ ను తయారు చేసి కన్సల్టెన్సీ సంస్థ ఎన్హెచ్ఎకు సమర్పించింది. ఈ నివేదికను ప్రాజెక్టు ఎప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ ముందు ప్రవేశపెట్టాల్సి ఉంది. అనంతరం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ఎప్రైజల్ కమిటీ(పీపీపీఏసీ) లో ఆమోదం పొందాలి.
ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి. మొత్తం 231.32కి.మీ. మేర ఆరు వరుసల రహదారిగా విస్తరించాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే విస్తరణ పనులు ప్రారంభిస్తారని భావించినా అది కాస్త వచ్చే సంవత్సరానికి వాయిదా పడినట్లు సమాచారం.
2026-27 ఆర్థిక సంవత్సరంలోనే పనులను చేపట్టాలని ఎన్హెచ్ఎఐ ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసింది. మరోవైపు ఈ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు తాజాగా 21 ప్రాంతాల్లో సుమారు రూ.85 లక్షలతో 2 నెలల కాల పరిమితితో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.
తాత్కాలిక పనులతో ప్రమాదాలను నివారించలేమని వాహనదారులు చెబుతున్నారు. ఈ జాతీయ రహదారి పరిధిలో మొత్తం 17 బ్లాక్స్పాట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో బ్లాక్‌స్పాట్ల వద్ద ఏడాదికి సగటున 20 మంది వరకు చనిపోతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ప్రమాదాల తీవ్రత ఈ మేరకు ఉన్నా కేవలం బ్లాక్స్పాట్ల వద్ద మరమ్మతులతోనే ఎన్హెచ్ఎఐ సరిపుచ్చుతోంది. విస్తరణ చేపడితే అందులో భాగంగా ఈ రహదారిపై చిన్నవి, పెద్దవి కలిపి 60 అండర్పాస్లను నిర్మిస్తారు. దీని ద్వారా ప్రమాదాలు చాలావరకు తగ్గే అవకాశాలున్నాయి.
ఇటీవల కాలంలో ఈ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటుండటంతో విస్తరణ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని వాహనదారులు, స్థానికుల నుంచి డిమాండ్ పెరుగుతోంది.