FSSAI: హింగ్‌ ఉత్పత్తులపై FSSAI కొరడా.. ఎవరెస్ట్‌, లాల్జీ గోదూ కంపెనీలపై కీలక చర్యలు!

FSSAI: ఆహార నాణ్యత విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కీలక నిర్ణయం తీసుకుంది. నాణ్యత ప్రమాణాలను పాటించలేదని గుర్తించిన ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్, లాల్జీ గోదూ అండ్ కంపెనీ తయారు చేసే కంపౌండెడ్ ఇంగువ (హింగ్‌) ఉత్పత్తుల తయారీ, విక్రయాలపై తక్షణమే ఆంక్షలు విధించింది.

FSSAI
FSSAI

ఎవరెస్ట్‌ హింగ్‌కు భారీ షాక్‌.. నాణ్యత ప్రమాణాలు పాటించలేదంటూ FSSAI కీలక నిర్ణయం..

హింగ్‌ ఉత్పత్తుల్లో నాణ్యత లోపాలు.. ఎవరెస్ట్‌, లాల్జీ గోదూపై FSSAI చర్యలు..

న్యూఢిల్లీ: ఆహార నాణ్యత విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కీలక నిర్ణయం తీసుకుంది. నాణ్యత ప్రమాణాలను పాటించలేదని గుర్తించిన ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్, లాల్జీ గోదూ అండ్ కంపెనీ తయారు చేసే కంపౌండెడ్ ఇంగువ (హింగ్‌) ఉత్పత్తుల తయారీ, విక్రయాలపై తక్షణమే ఆంక్షలు విధించింది.

పరీక్షల్లో కొన్ని ఉత్పత్తులు నిర్దేశిత ప్రమాణాలకు తగ్గట్టుగా లేకపోవడంతో పాటు, లేబులింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు FSSAI పేర్కొంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

ఎవరెస్ట్‌ హింగ్‌ ఉత్పత్తులపై నిషేధం
FSSAI ఆదేశాల ప్రకారం ఎవరెస్ట్‌ ఫుడ్ ప్రొడక్ట్స్‌కు చెందిన కంపౌండెడ్ హింగ్‌ పౌడర్ నమూనాలను ప్రాథమిక ఆహార పరీక్షా ప్రయోగశాలలో పరీక్షించారు. ఈ నమూనాలు ‘మిస్‌బ్రాండెడ్’, ‘సబ్‌స్టాండర్డ్‌’గా తేలినట్లు నియంత్రణ సంస్థ తెలిపింది.

హింగ్‌లో ఆల్కహాల్‌లో కరిగే పదార్థం (Alcohol Soluble Extract) కనీసం 5 శాతం ఉండాలి. అయితే ఒక నమూనాలో ఇది ఏకంగా 0 శాతంగా నమోదైంది. ఎల్లో హింగ్‌ పౌడర్‌లో 3.29 శాతం, బ్లాక్ హింగ్‌ పౌడర్‌లో 4.4 శాతంగా ఉన్నట్లు FSSAI వెల్లడించింది.

సాధారణ తనిఖీల్లో, వివిధ ప్రాంతాలు మరియు వేర్వేరు వనరుల నుంచి సేకరించిన నమూనాల్లోనూ ఇలాంటి లోపాలే కనిపించాయని సంస్థ తెలిపింది. అంటే 5 శాతం కనీస ప్రమాణం కంటే తక్కువ ఆల్కహాల్ సొల్యూబుల్ ఎక్స్‌ట్రాక్ట్ ఉన్న ఉత్పత్తులు పలు చోట్ల గుర్తించినట్లు పేర్కొంది. దీంతో ఎవరెస్ట్‌కు చెందిన కంపౌండెడ్ హింగ్‌, దాని అన్ని వేరియంట్ల విక్రయాలను తదుపరి ఆదేశాల వరకు తక్షణమే నిలిపివేయాలని FSSAI ఆదేశించింది.

యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని ఆదేశం
సబ్‌స్టాండర్డ్ హింగ్‌ విక్రయాలు కొనసాగకుండా తీసుకునే చర్యలపై ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ యాక్షన్ ప్లాన్ సమర్పించాలని FSSAI స్పష్టం చేసింది. Food Safety and Standards Act, 2006 ప్రకారం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఉత్పత్తులు మాత్రమే మార్కెట్‌లో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కంపెనీ నుంచి సంతృప్తికరమైన వివరణ రాకపోయినా, నిబంధనల అమలులో లోపాలు కొనసాగినా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.

గరం మసాలా, చికెన్ మసాలాపైనా గతంలో అభ్యంతరాలు
ఎవరెస్ట్‌కు సంబంధించిన గత తనిఖీల్లో కూడా కొన్ని ఉత్పత్తులపై FSSAI అనుమానాలు వ్యక్తం చేసింది. ఎవరెస్ట్ గరం మసాలా, చికెన్ మసాలా, ఎగ్ కర్రీ పౌడర్ వంటి ఉత్పత్తుల్లో లేబులింగ్‌కు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు నియంత్రణ సంస్థ పేర్కొంది.

ప్రత్యేకంగా ఉత్పత్తుల్లో 5 శాతానికి మించిన ఉప్పు శాతాన్ని లేబుల్‌పై ప్రకటించకపోవడం, మసాలా పదార్థాల వివరాలను సరిగ్గా పేర్కొనకపోవడం వంటి అంశాలను FSSAI గతంలో గుర్తించినట్లు తెలిపింది.

లాల్జీ గోదూ కంపెనీ హింగ్‌పైనా ఆంక్షలు 
ఇదే సమయంలో లాల్జీ గోదూ అండ్ కంపెనీపై కూడా FSSAI చర్యలు తీసుకుంది. కంపెనీ తయారు చేసే కంపౌండెడ్ హింగ్‌ లేదా కంపౌండెడ్ ఆసఫొటిడా ఉత్పత్తుల తయారీ, విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.

కంపెనీకి చెందిన హింగ్‌ పౌడర్‌, లంప్‌ వేరియంట్ల నమూనాలను పరీక్షించగా అవి సబ్‌స్టాండర్డ్‌, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేనివిగా తేలినట్లు FSSAI తెలిపింది. కొన్ని నమూనాలు మిస్‌బ్రాండెడ్‌గా కూడా గుర్తించినట్లు పేర్కొంది.

హింగ్‌లో స్టార్చ్‌పై కీలక నిబంధన 
లాల్జీ గోదూ తయారీలో ఉపయోగించిన ముడి హింగ్‌ రకాలలో స్టార్చ్‌ పరిమాణం అధికంగా ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని FSSAI వెల్లడించింది. FSSAI నిబంధనల ప్రకారం హింగ్‌లో స్టార్చ్‌ పరిమాణం బరువులో 1 శాతానికి మించకూడదు. అయితే కంపెనీ తయారీలో ఉపయోగించిన ముడి పదార్థాల్లో ఈ పరిమితికి మించి స్టార్చ్‌ ఉన్నట్లు నియంత్రణ సంస్థ గుర్తించింది.

మార్కెట్‌ సర్వైలెన్స్‌, చట్టపరమైన నమూనాల సేకరణ, ముడి పదార్థాల పరీక్షా నివేదికల్లోనూ నిబంధనలకు విరుద్ధమైన ఫలితాలు రావడంతో ఈ లోపాలు కొన్ని బ్యాచ్‌లకే పరిమితం కాకుండా విస్తృతంగా ఉన్నట్లు కనిపిస్తోందని FSSAI పేర్కొంది.

ప్రమాణాలు పాటించాలని స్పష్టమైన ఆదేశాలు
లాల్జీ గోదూ అండ్ కంపెనీ కూడా గుర్తించిన లోపాలను సరిదిద్దేందుకు యాక్షన్ ప్లాన్ సమర్పించాలని FSSAI ఆదేశించింది. భవిష్యత్‌లో ఆహార భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఉత్పత్తులను మాత్రమే తయారు చేసి విక్రయించాలని స్పష్టం చేసింది.

ఆహార ఉత్పత్తుల నాణ్యత విషయంలో వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని ఈ చర్యలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. మార్కెట్‌లోకి వచ్చే ఉత్పత్తులు నిర్దేశిత ప్రమాణాలను పాటిస్తున్నాయా లేదా అనే అంశంపై FSSAI తనిఖీలు, నమూనాల పరీక్షలను కొనసాగిస్తోంది.

Tags

Be the first to react

Latest