విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సీఐఐ–పార్ట్నర్‌షిప్ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను రాబట్టింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో రాష్ట్రానికి ఇప్పటి వరకు మొత్తం రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దావోస్ శైలి నిర్వహణతో ఈ సదస్సును అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించామని, 60 దేశాల నుంచి 30కి పైగా మంత్రులు, వందలాది పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారని సీఎం తెలిపారు. మొత్తం 67 కీలక సెషన్లు, 700కు పైగా బీటు–బీ సమావేశాలు నిర్వహించటం ద్వారా పారిశ్రామికవేత్తలతో విశాలంగా చర్చలు జరిగాయి.
ఒక్క గురువారం రోజే విశాఖ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం భారీ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 35 అంతర్జాతీయ, దేశీయ సంస్థలు రూ.3,65,304 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయూలను రాష్ట్రంతో కుదుర్చుకున్నాయి. ఈ పెట్టుబడులు పూర్తిగా అమలైతే 16,31,188 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందాలపై ప్రభుత్వం వెంటనే ప్రోత్సాహక ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. గడచిన 18 నెలల్లోనే రాష్ట్రానికి రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని అధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శ్రీసిటీలో పలు పరిశ్రమలను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే ఇక్కడ మరో 12 ప్రాజెక్టుల కోసం కొత్త ఒప్పందాలు కుదిరాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 12,365 మందికి ఉద్యోగాలు రానున్నాయని ఆయన వెల్లడించారు. శ్రీసిటీ అభివృద్ధి మోడల్‌గా ఎదిగిందని, డైకిన్, ఇసుజు, క్యాడ్‌బరీ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఇక్కడే తమ ఉత్పత్తులను తయారు చేసి ప్రపంచ మార్కెట్లకు పంపిస్తున్నాయని చెప్పారు. త్వరలోనే శ్రీసిటీ విస్తరణ కోసం మరిన్ని 6 వేల ఎకరాలు కేటాయించనున్నట్లు ప్రకటించారు. మొత్తం 50 దేశాల కంపెనీలు ఇక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నాయని, సమీప భవిష్యత్తులో 1.5 లక్షల ఉద్యోగాలతో దేశంలోనే ఆదర్శ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ భారీ సదస్సులో మొత్తం 4,975 మంది పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో 640 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 1,135 మంది దేశీయ ప్రతినిధులు, 185 మంది దౌత్యవేత్తలు ఉన్నారు. ఎంవోయూల భాగస్వాములు 1,575 మంది, రాష్ట్ర అధికారులతో కలుపుకుని ఈ సంఖ్య 5,587కు చేరింది. రెండురోజుల్లో 41 ముఖ్యమైన సెషన్లు, 26 ప్లీనరీ సమావేశాలు, 11 రాష్ట్ర సెషన్లు, 4 దేశీయ సదస్సులు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం 24 ద్వైపాక్షిక సమావేశాలు, 16 వ్యాపార సమావేశాల్లో పాల్గొనడం ద్వారా పరిశ్రమలతో సడెన్‌గా పెట్టుబడులను ఆకర్షించగలిగారు. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే పెట్టుబడులకు ప్రధాన గమ్యంగా మారిందని పరిశ్రమల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.