గుంటూరు వేదికగా జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలు రెండో రోజు కనుల పండువగా కొనసాగాయి. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను చాటేలా నిర్వహించిన ఈ మహాసభలు తెలుగువారిలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సభలకు దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా తొలిసారిగా ఒక దేశాధ్యక్షుడు ఈ మహాసభల్లో పాల్గొనడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మారింది.
మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ సతీసమేతంగా మహాసభలకు హాజరయ్యారు. ఆయనకు నిర్వాహకులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అశ్వరథంపై ఆయనను ప్రధాన వేదిక వరకు తీసుకువచ్చి ఆత్మీయంగా ఆహ్వానించారు. వేదికపై ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహానికి నమస్కరించిన ధరమ్ బీర్ గోకుల్, అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి తెలుగువారిపై తన అభిమానాన్ని చాటారు. ఈ దృశ్యాలు సభకు హాజరైన వారిని ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
సభ ప్రారంభంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఆంధ్ర సాహిత్యం, చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు సభకు ప్రత్యేక వైభవాన్ని తీసుకొచ్చాయి. తెలుగు భాష గొప్పదనాన్ని ప్రతీ ఒక్కరికీ గుర్తు చేసేలా ఈ కార్యక్రమాలు సాగాయి.
ఈ సందర్భంగా మారిషస్ అధ్యక్షుడు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారి సంఖ్య ఎంతో గొప్పదని తెలిపారు. దేశంలో మాట్లాడే భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. మారిషస్‌లో ఉగాది పండుగను జాతీయ సెలవుగా ప్రకటించామని, తెలుగు సంస్కృతి అక్కడి జీవనశైలిలో ఒక భాగంగా మారిందని చెప్పారు. మారిషస్‌లో తెలుగును తృతీయ భాషగా గుర్తించి, విద్యా వ్యవస్థలోనూ ప్రోత్సహిస్తున్నామని వివరించారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన నాయకులను ఆయన ప్రశంసించారు.
తెలుగు సంస్కృతిని ప్రపంచానికి చాటాల్సిన బాధ్యత మనందరిదేనని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నా, మన పండుగలను మర్చిపోతున్నామన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో నివసిస్తున్న తెలుగువారే మన పండుగలను గొప్పగా జరుపుకుంటున్నారని, తెలుగు రాష్ట్రాల్లోనూ అదే స్ఫూర్తి రావాలని కోరారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. జయసూర్య మాట్లాడుతూ, మాతృభాష తెలుగును ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాలని సూచించారు. ఆంగ్ల భాష అవసరమే అయినా, మాతృభాషను విస్మరించడం సరైంది కాదన్నారు. తెలుగు భాష పరిరక్షణకు అందరూ కలిసి నడుం బిగించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
జనసేన ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ మాట్లాడుతూ, తెలుగు భాషాభివృద్ధికి మారిషస్ దేశం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అక్కడ ఒకటి నుంచి పీజీ స్థాయి వరకు తెలుగు నేర్పిస్తున్న విధానం ప్రశంసనీయమని చెప్పారు. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ మహాసభల్లో తెలుగువారి కోసం సేవలందిస్తున్న పలువురు ప్రముఖులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. దేశ విదేశాల్లో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ కోసం కృషి చేస్తున్నవారిని పురస్కారాలతో గౌరవించారు. సాహిత్యం, సంస్కృతి, కళలు ఒకే వేదికపై కలిసిన ఈ ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచాయి. గుంటూరు వేదికగా సాగుతున్న ఈ సంబరాలు మరికొన్ని రోజుల పాటు తెలుగు భాష వైభవాన్ని చాటుతూనే ఉండనున్నాయి.