భారతదేశంలో ఉద్యోగుల మానసిక స్థితి, ఉద్యోగ సంతృప్తిపై మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ఒక ఆసక్తికరమైన వైరుధ్యాన్ని బయటపెట్టింది. దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ఉద్యోగుల అభిప్రాయాలతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, దాదాపు 95 శాతం మంది ఉద్యోగులు తమ నైపుణ్యాలపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ, కేవలం 64 శాతం మంది మాత్రమే తమ ఉద్యోగంతో సంతృప్తిగా ఉన్నట్లు తేలింది.
తమ పని బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగలమన్న ఆత్మవిశ్వాసం ఉన్నా, ఉద్యోగం పట్ల ఆనందం, సంతృప్తి మాత్రం అందరికీ లేదని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
నివేదికలో వెల్లడైన వివరాల ప్రకారం, ఉద్యోగుల్లో 90 శాతం మంది కెరీర్ డెవలప్‌మెంట్ అవకాశాలు ఉన్నాయని, 84 శాతం మంది ప్రమోషన్లు వస్తాయనే ఆశతో ఉన్నారని తెలిపారు. అదేవిధంగా 90 శాతం మంది ఏఐ (AI) టెక్నాలజీని వాడటంలో తాము నైపుణ్యం సాధించామని పేర్కొన్నారు.
అయితే ఈ అన్ని అంశాల్లో ఉన్న నమ్మకం ఉద్యోగ సంతృప్తిగా మారడం లేదని నివేదిక స్పష్టంగా చెప్పింది. ఇందుకు ప్రధాన కారణంగా పని ఒత్తిడి నిలుస్తోందని విశ్లేషణలో తేలింది. సుమారు 53 శాతం మంది రోజూ తీవ్రమైన లేదా మోస్తరు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
ఈ అంశంపై స్పందించిన మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా, మిడిల్ ఈస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ గులాటి, అధిక పనిభారం, ఎక్కువ పని గంటల వల్ల 75 శాతం మంది ఉద్యోగులు బర్న్‌అవుట్‌కు గురవుతున్నారని తెలిపారు.
చాలామంది కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, ఉద్యోగ భద్రతపై ఉన్న ఆందోళనల కారణంగా దాదాపు సగం మంది ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్నే కొనసాగిస్తున్నారని వివరించారు. ఇది భారత ఉద్యోగ మార్కెట్‌లో కనిపిస్తున్న ఒక ప్రధాన మానసిక సమస్యగా ఆయన అభిప్రాయపడ్డారు.
ఉద్యోగ వర్గాల వారీగా చూస్తే, బ్లూ-కాలర్ వర్కర్లలో 68 శాతం మంది శ్రేయస్సు తక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అలాగే జెన్-జెడ్ మహిళలు (64 శాతం) అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వర్గంగా నిలిచారు.
వైట్-కాలర్ ఉద్యోగులు, సీనియర్ మేనేజర్లు తమ పనిలో కొంత సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, వారే అత్యంత ఒత్తిడిని ఎదుర్కొంటున్న గ్రూపులుగా ఉన్నారని నివేదిక పేర్కొంది. రంగాల వారీగా చూస్తే, ఎనర్జీ, యుటిలిటీస్ రంగంలో ఉద్యోగుల శ్రేయస్సు 72 శాతం మేర అత్యల్పంగా, హెల్త్‌కేర్ (52 శాతం), ఫైనాన్షియల్స్ (50 శాతం) రంగాల్లో ఉద్యోగ భద్రతపై నమ్మకం తక్కువగా ఉందని తేలింది. కేవలం నైపుణ్యాలపై విశ్వాసం ఉంటే సరిపోదని, ఉద్యోగులను నిలుపుకోవాలంటే సంస్థలు స్పష్టమైన కెరీర్ మార్గాలు, మేనేజర్లపై నమ్మకం, ఉద్యోగుల సంక్షేమంపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని సందీప్ గులాటి సూచించారు.