ఉత్సాహంగా ఉత్సవ్ 2.. ఈసారి మైసూరు వేడుకలకు దీటుగా విజయవాడ!
విజయవాడ: విజయవాడ నగరంలో దసరా వేడుకలకు మరింత వైభవాన్ని తీసుకురావడానికి ‘విజయవాడ ఉత్సవ్ సీజన్-2’కు శ్రీకారం చుట్టారు. సింగ్‌నగర్ స్టేడియంలో సోమవారం ఉత్సవాల పనులకు శంకుస్థాపన నిర్వహించారు. బోండా ఉమా కుమారుడు బోండా సిద్ధార్థ, ఏపీ భవన నిర్మాణ కార్మికుల సలహా సంఘం చైర్మన్ గొట్టిముక్కల రఘు, ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ తేజస్విని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సింగ్‌నగర్ స్టేడియంలో ఘనంగా శంకుస్థాపన జరిగింది.
- 3 గజరాజులు, అమ్మవారి 9 అవతారాల విగ్రహాలు కార్నివాల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
విజయవాడ: విజయవాడ నగరంలో దసరా వేడుకలకు మరింత వైభవాన్ని తీసుకురావడానికి ‘విజయవాడ ఉత్సవ్ సీజన్-2’కు శ్రీకారం చుట్టారు. సింగ్‌నగర్ స్టేడియంలో సోమవారం ఉత్సవాల పనులకు శంకుస్థాపన నిర్వహించారు. బోండా ఉమా కుమారుడు బోండా సిద్ధార్థ, ఏపీ భవన నిర్మాణ కార్మికుల సలహా సంఘం చైర్మన్ గొట్టిముక్కల రఘు, ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ తేజస్విని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ.. ఈసారి విజయవాడ ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భారత రాష్ట్రపతితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉత్సవాలకు హాజరుకానున్నారని వెల్లడించారు. దుర్గమ్మ, కృష్ణమ్మ చెంత ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని కలగలిపేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. పున్నమిఘాట్, మాకినేని బసవపున్నయ్య (ఎంబీకే) స్టేడియంలో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దసరా ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవాల్లోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు
‘సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ’ ఆధ్వర్యంలో ఉత్సవాలకు అంకురార్పణ చేసినట్లు గొట్టిముక్కల రఘు తెలిపారు. మాకినేని బసవపున్నయ్య స్టేడియం, పున్నమిఘాట్, సిద్ధార్థ ఫార్మా కాలేజీ, పవిత్ర సంగమం ప్రాంతాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఎంపీ కేశినేని చిన్ని, బోండా ఉమామహేశ్వరరావు నాయకత్వంలో ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక కళాకారులతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సాంస్కృతిక బృందాలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా కళాకారులకు రాబోయే కొన్ని నెలల పాటు ఉపాధి లభించే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఈసారి ఉత్సవాల్లో లేజర్ షోలు, డ్రోన్ షోలు, క్రాకర్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని రఘు వెల్లడించారు.
ఏలూరు రోడ్డుపై కనువిందు చేయనున్న కార్నివాల్
విజయవాడ ఉత్సవాల్లో ఈసారి భారీ కార్నివాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఏపీ కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ తేజస్విని మాట్లాడుతూ.. పున్నమిఘాట్‌తో పాటు మాకినేని బసవపున్నయ్య స్టేడియంలోనూ పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని సుమారు 40 నుంచి 45 రకాల జానపద, సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులు, ప్రముఖ గాయకులు, భజన్ జ్యామింగ్ బృందాలు, లైవ్ బ్యాండ్లు, మ్యూజికల్ కాన్సెర్ట్‌లు ఉత్సవాల్లో భాగం కానున్నాయని తెలిపారు.
విద్యార్థులు, యువత, మహిళలు, కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల '8 నుంచి 12వ తేదీ వరకు' వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు తేజస్విని వెల్లడించారు.
4 వేల మంది కళాకారులతో భారీ ప్రదర్శన
ఉత్సవాల ముగింపు రోజైన అక్టోబర్ 20న ఏలూరు రోడ్డుపై భారీ కార్నివాల్ నిర్వహించనున్నారు. మూడు గజరాజులు, అమ్మవారి తొమ్మిది అవతారాల విగ్రహాలు, సుమారు 4 వేల మంది కళాకారులు ఈ కార్నివాల్‌లో పాల్గొననున్నారు. వేలాది మంది వీక్షించేలా భారీ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నట్లు తేజస్విని తెలిపారు. దసరా ఆధ్యాత్మిక శోభకు సాంస్కృతిక వైభవాన్ని జోడిస్తూ నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్ సీజన్-2 నగర ప్రజలకు, సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని అందించనుంది.
Tags
Be the first to react